తెలంగాణ చేనేత మరియు జౌళి శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ – గోల్కొండ షాపింగ్ పోర్టల్ ను టెక్స్టైల్ శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ ఈరోజు ప్రగతి భవన్ లో ఆవిష్కరించారు.
తెలంగాణ రాష్ట్ర హ్యాండీక్రాఫ్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రూపొందించిన ఈ -గోల్కొండ షాపింగ్ పోర్టల్ ద్వారా అద్భుతమైన సాంప్రదాయ కళాకృతులను మరియు చేతి బొమ్మలను కొనుగోలు చేసే వీలు ఉంటుందని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి చేనేత మరియు జౌళి శాఖలో ఒక విభాగమైన హ్యాండీక్రాఫ్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ను బలోపేతం చేస్తూ వస్తున్నామని ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు.
ఈరోజు ప్రారంభించిన పోర్టల్ ద్వారా తెలంగాణ హ్యాండీక్రాఫ్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రూపొందిస్తున్న అనేక అద్భుతమైన ఉత్పత్తులకు ప్రపంచ స్థాయి ఈ-మార్కెట్ ప్లేస్ ని తయారుచేయడమే లక్ష్యంగా ఈ పోర్టల్ రూపొందించినట్లు ఆయన తెలిపారు.
ప్రస్తుతం ప్రజలకు అందుబాటులో ఉన్న అనేక ప్రైవేట్ ఈ- కామర్స్ వెబ్ సైట్ల కంటే అత్యుత్తమంగా ఈ వెబ్ పోర్టల్లో సౌకర్యాలను రూపొందించామన్నారు.
ఈ వెబ్ పోర్టల్ ద్వారా ప్రస్తుతం దేశంలోని ఏ ప్రాంతానికైనా తమ కళాకృతులను చేర్చేందుకు వీలుందని, త్వరలోనే అవసరమైన కేంద్ర ప్రభుత్వ అనుమతులు పొందిన తర్వాత, ప్రపంచంలో ఎక్కడికైనా తమ కళాకృతులను పంపే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.
ఈ- గోల్కొండ ద్వారా అమ్మకానికి ఉంచిన ప్రతి కళాకృతిని సునిశితంగా పరిశీలించేందుకు అవసరమైన 3డి సౌకర్యాన్ని సైతం అందుబాటులో ఉంచామన్నారు.
ఈ వెబ్సైట్ మొబైల్ ఫోన్ లకు సరిపడే విధంగా రూపొందించామని తెలిపారు.
ఈ ఈ-గోల్కొండ పోర్టల్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో తయారవుతున్న హ్యాండీక్రాఫ్ట్ మరియు ఇతర అద్భుతమైన కళాకృతులకు మార్కెటింగ్ మరియు అవసరమైన ప్రచారాన్ని కల్పించే వీలు కలుగుతుందన్నారు.
https://golkondashop.telangana.gov.in/ లింకు ద్వారా తమకు నచ్చిన కళాకృతులను ప్రజలు కొనుగోలు చేసే వీలుందన్నారు.
రాష్ట్రంలో అనేక శతాబ్దాలుగా కొనసాగుతున్న అద్భుతమైన హ్యాండీక్రాఫ్ట్ కళను కొనసాగించేందుకు టెక్స్టైల్ డిపార్ట్మెంట్ తరఫున అవసరమైన నైపుణ్య శిక్షణ, సాంకేతిక సహకారం, మార్కెటింగ్ వంటి సేవలతో పాటు ఒక కామన్ ఫెసిలిటీ సెంటర్ ను ఏర్పాటు చేసి రాష్ట్రంలోని కళాకారులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీ మల్లారెడ్డి, తెలంగాణ రాష్ట్ర హ్యాండీక్రాఫ్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ బొల్లం సంపత్ కుమార్ మరియు టెక్స్టైల్ శాఖ సెక్రటరీ శైలజ రామయ్యారు మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Ministers Sri KTR and Sri CH Malla Reddy launched the #eGolkonda Shopping Portal www.golkondashop.telangana.gov.in – of Telangana State Handicrafts Development Corporation (TSHDC) today. Principal Secretary Jayesh Ranjan, TSHDC Chairman Sri Bollam Sampath Kumar and Handlooms & Textiles Director Smt Shailaja Ramaiyer were present.