భానుడి సెగలు భగ భగ… బీర్లు అమ్మకాలు గబా గబా….
ఎండలు పెరిగి భానుడు ఉగ్రరూపం దాల్చడంతో తెలంగాణ రాష్ట్రంలో బీర్ల అమ్మకాలు జోరందుకున్నాయి.
సహజంగా బీర్లకు డిమాండ్ ఉన్నా వేసవి తాపానికి చల్ల చల్లటి బీరును తాగేందుకు మద్యం ప్రియులు ఇష్టపడుతున్నారు.
మార్చి మొదటి వారం నుంచే భానుడు తన ఉగ్రరూపం చూపిస్తున్నాడు. ఉదయం 9 నుంచే ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో మందుబాబులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.
ఉపశమనం పొందేందుకు వీరంతా చల్లటి బీర్ వైపు మొగ్గుచూపుతున్నారు. దీంతో మార్చి నెలలోనే బీర్లకు విపరీతంగా డిమాండ్ పెరిగింది.
నిత్యం పెరుగుతున్న అమ్మకాలతో బార్లు, వైన్స్ షాపులు కిటకిటలాడుతున్నాయి.
ప్రస్తుతం వర్క్ ఫ్రం హోమ్ ఉన్నందున అధిక పనిభారంతో స్ట్రెస్ ఫీల్ అవుతున్న యువత బీర్లను తాగి చిల్ అవుతూ రిలీఫ్ అవుతున్నారు.
ఏకధాటిగా అధిక ఉష్ణోగ్రతలతో ఎండలు మండుతుండడంతో ఏప్రిల్, మే నెలల్లో మరింతగా బీర్ల విక్రయాలు పెరుగుతాయని ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు.
బీర్ల అమ్మకాలు జోరు మీద ఉండటంతో ఎక్సైజ్ శాఖ కూడా తగినన్ని బీర్లను సమకూర్చే పనిలో పడింది.
పెరిగిన డిమాండుకు అనుగుణంగా కస్టమర్లకు చల్లటి బీర్లను అందించేందుకు మద్యం దుకాణాల యజమానులు సైతం తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
కరోనా వైరస్ రాకుండా ఉండాలంటే చల్లటి పదార్థాలకు దూరంగా ఉండాలని వైద్యులు సలహాలు ఇవ్వడంతో బీర్ల అమ్మకాలు గణనీయంగా తగ్గాయి.
లాక్డౌన్ అనంతరం ఆరు నెలలు కూడా బీర్ల అమ్మకాలు అంతంత మాత్రంగానే సాగాయి.
ఈ యేడాది మొదలైన నాటి నుంచి కరోనా ప్రభావం తగ్గడంతో పాటు అన్ని కార్యక్రమాలు జరుగుతుండటంతో అమాంతం బీర్ల అమ్మకాలు పెరిగాయి.
ప్రస్తుతం ఏ మద్యం దుకాణంలో అడిగినా ‘నో చిల్డ్ బీర్ ’అంటూ సమాధానం వస్తోంది.
చల్లటి బీర్ల కోసం బారులు తీరుతున్న మందుబాబులను నిరాశపర్చకూడదని నిర్వాహకులు ప్రత్యేకంగా ఫ్రిడ్జులను ఏర్పాటుచేసుకోవాల్సి వచ్చింది.
ఈ పెరిగిన అమ్మకాలు ప్రభుత్వానికి భారీ మొత్తంలో ఆదాయాన్ని సమకూరుస్తున్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైన్స్ షాపులు, బార్లు, పబ్బులు, క్లబ్బులు కలిసి 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 2,73,32,828 బీర్ల కేసులను అమ్మేశాయి.
గత మూడు నెలలుగా బీర్ల అమ్మకాలు పెరుగుతుండటంతో మార్చి నెలలో 29,59,118 బీర్ల కేసులు
మద్యం ప్రియులు తాగేశారు.
ఇది 2020-21 ఆర్థిక సంవత్సరంలో రికార్డు అమ్మకాలుగా చెప్పుకోవచ్చు.
ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మద్యం అమ్మకాల జోరు కొంత ఉపశమనం కల్గిస్తున్నాయి.
క్ర.సంఖ్య | నెల | బీర్ల అమ్మకం( కేసుల్లో) |
01 | జనవరి-2021 | 28,05,544 |
02 | ఫిబ్రవరి-2021 | 22,55,524 |
03 | మార్చి-2021 | 29,59,118 |