అరకులోయలో భారీ వడగళ్ల వాన:
విశాఖ ఏజెన్సీ అరకు లోయ ప్రాంతంలో సోమవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. గత వారం రోజులుగా ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటల నుండి 6 గంటల వరకు వర్షం కురుస్తూనే ఉంది.
అయితే సోమవారం మధ్యాహ్నం ఒంటిగంట నుండే భారీ వడగళ్లతో వర్షం కురవడంతో పరిసర ప్రాంతాల ప్రజలు ఎక్కడికక్కడ స్తంభించిపోయారు.
సుమారు రెండు గంటలపాటు ఏకధాటిగా వర్షం కురవడంతో దూరప్రాంతాలకు వెళ్లే గిరిజనులు ఇబ్బందులు పడ్డారు.
గత వారం రోజులుగా అరకులోయలో వర్షం పడుతుండడంతో ఇది వేసవి కాలమా వాన కాలమా అంటూ ప్రజలు చెప్పుకుంటున్నారు.
అరకులోయలో గత వారం రోజులుగా వాతావరణం వేసవి కాలాన్ని మరిపిస్తుంది వానాకాలాన్ని తలపింప చేస్తుంది.
సోమవారం కురిసిన భారీ వర్షంతో అరకులోయ పట్టణంలోని కాలువలకు మోక్షం లభించింది .
