ఏజెన్సీలో ఇసుక దందా… రెవెన్యూ అధికారుల కనుసన్నల్లోనే ఇసుక మాఫియా..
విశాఖ-పాడేరు:
విశాఖ ఏజెన్సీలో అతిపెద్ద ప్రవాహం అయిన మత్స్య గడ్డ పరివాహక ప్రాంతంలో ఇసుక దందా భారీగా కొనసాగుతుంది.
ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుక మాఫియా ఇష్టారాజ్యంగా అక్రమ క్వారీలు నిర్వహిస్తున్నారు.
రెవెన్యూ అధికారుల కనుసన్నల్లోనే ఇసుక దందా కొనసాగుతున్నట్లు స్థానికులనుండి ఆరోపణలు వినిపిస్తున్నాయి.
గ్రామ వాలంటీర్ స్థాయి నుండి మండల రెవెన్యూ అధికారి స్థాయి వరకు భారీగా మామూళ్ళు వసూలు చేస్తూ నెలవారి వాటాలు క్వారీల చొప్పున తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం…!
అతిపెద్ద ప్రవాహమై మత్య గడ్డ పరివాహక ప్రాంతంలో జి.మాడుగుల మొదలుకొని పాడేరు, పెదబయలు మండలాలను కలుపుతూ చుట్టుమెట్ట వరకు అక్రమ ఇసుక క్వారీలు తవ్వకాలు జరుగుతున్నాయి.
క్వారీల నిర్వాహకులు నెలవారీ రెవెన్యూ అధికారులకు చెల్లింపులు చేస్తున్నట్లు పలువురు నిర్వాహకులు చెబుతున్నారు.
జి.మాడుగుల మండలం బంధ వీధి మొదలుకొని పాడేరు మండలం రాయిగడ్డ, ఈడపల్లి, దుమ్మ పుట్టు, వాల్లపురం, జీ.ముంచంగిపుట్టు, పరదని పుట్టు, ఈదులపాలెం, గలగండ చుట్టుమెట్ట వరకు అక్రమ ఇసుక క్వారీల్లో తవ్వకాలు జరుగుతున్నాయి.
వీటిపై రెవెన్యూ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంలో రెవెన్యూ అధికారులకు మామూలు అందుతుందో లేదో తేటతెల్లమవుతుంది.
ప్రతీ రోజు వందల లారీలు, టిప్పర్లలో ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని స్థానికులు వాపోతున్నారు.
రెవెన్యూ ఉన్నత అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇసుక దందా ఏజెన్సీ లో భారీగా కొనసాగుతుందని వారంటున్నారు.
ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రెవెన్యూ అధికారుల దంధాలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా గిరిజన ప్రజలకు ప్రభుత్వానికి ప్రయోజనం కలిగించే విధంగా చర్యలు చేపట్టాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.