పిచ్చుకలను పరిరక్షించుకోవాలి ….
ప్రభుత్వ ఛీఫ్ విప్ , వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ భాస్కర్.
ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని తెలంగాణ అటవీ శాఖ కేబీఆర్ పార్కులో ఘనంగా నిర్వహించింది.
ఈ సందర్భంగా పిచ్చుకలకి సంబంధించిన వివిధ రకాల చిత్రాలను ప్రదర్శించారు.
ఈ కార్యక్రమంలో పీసీసీఎఫ్ శోభ, సీసీఎఫ్ అక్బర్ లతో కలిసి ప్రభుత్వ చీఫ్ విప్ ధాస్యం వినయ్ భాస్కర్ పాల్గొన్నారు.
కార్యక్రమంలో దాస్యం వినయ భాస్కర్ మాట్లాడుతూ చూడడానికి చిన్న ప్రాణే అయినా, జీవవైవిధ్యంలో తన వంతు పాత్రను పోషిస్తోన్న పిచ్చుకలు నగరాలు కాంక్రీట్ జంగిళ్ళగా మారడం మూలాన కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడిందన్నారు.
కమ్యూనికేషన్ రంగంలో వచ్చిన విప్లవం వల్ల పెరుగుతున్న రేడియేషన్ వల్ల చిట్టి గువ్వలు బలవుతున్నాయన్నారు.
పర్యావరణాన్ని తన శక్తిమేరకు కాపాడే పిచ్చుకలను రక్షించేందుకు పక్షి ప్రేమికులు నడుం బిగించాల్సిన పరిస్థితి వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు.
పిచ్చుకల సంరక్షణ కోసం అటవీ శాఖ తీసుకుంటున్న చర్యలను అభినందించారు.
పర్యావరణాన్ని కాపాడే ఈ పిచ్చుకల జాతిని సంరక్షించుకునే బాధ్యత మనపై ఉందన్నారు.
అంతరిస్తున్న పక్షుల జాబితాలో ఉన్న పిచ్చుకలను సంరక్షించాలన్న లక్ష్యంతో ఏటా మార్చి 20వ తేదీని పిచ్చుకల సంరక్షణ దినంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నామని ఇదే స్పూర్తితో వరంగల్ వైల్డ్ లైఫ్ సొసైటీ ఆధ్వర్యంలో పలు రకాల వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆ సంస్థ నిర్వహకులైన శ్యామ్ సుందర్, నాగేశ్వర్ రావులను అభినందించారు.
ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని పురస్కరించుకుని వాటి సంరక్షణ కోసం GIFT A NEST అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తునట్లు ప్రకటించారు.
తాను పక్షి గూళ్లను అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రముఖ గాయకుడు, బిగ్ బాస్ – 4 విజేత రాహుల్ సిప్లిగంజ్ లకు బహుమతిగా అందజేసి వారందరినీ GIFT A NEST ఛాలెంజ్ కి నామినేట్ చేశారు.
వేసవికాలం రానున్న తరుణంలో చెట్లన్ని ఎండిపోయి పక్షులకు ఆవాసం, తాగునీరు కరువయి వేలాది పక్షులు మృత్యువాత పడుతున్నాయని కాబట్టి వాటిని సంరక్షించడం కోసం ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ బాధ్యులు శ్యామ్ సుందర్ శర్మ, నాగేశ్వర్ రావు, కేబీఆర్ వాకర్స్ అసోసియేషన్ సెక్రటరీ విజయ్ కుమార్ పక్షి ప్రేమికులు పాల్గొన్నారు.