కొవిడ్ రిపోర్టు ఉంటేనే సేవకు..: తితిదే
తిరుమల: ఆన్లైన్లో ముందస్తుగా బుక్ చేసుకున్న వారిని మాత్రమే ఆర్జిత సేవలకు అనుమతిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఈవో కేఎస్ జవహర్‌రెడ్డి వెల్లడించారు.
కరోనా భయం పూర్తిగా తొలగిన తర్వాతే ఆన్లైన్ లక్కీడిప్ ద్వారా సేవా టికెట్లను జారీ చేస్తామని తెలిపారు.
తిరుమలలోని అన్నమయ్య భవన్లో శుక్రవారం ఉదయం ‘డయల్ యువర్ ఈవో’ కార్యక్రమం అనంతరం జవహర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఆన్లైన్లో ఆర్జిత సేవా టికెట్లు బుక్ చేసుకునేవారు సేవకు 72 గంటల ముందు కొవిడ్ పరీక్ష చేయించుకుని సర్టిఫికెట్ తీసుకువస్తేనే అనుమతిస్తామని స్పష్టం చేశారు.
కొవిడ్ తగ్గుముఖం పట్టడంతో తిరుమలలో ఉగాది నుంచి శ్రీవారి ఆర్జిత సేవలను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించినట్లు తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి గతంలో వెల్లడించిన విషయం తెలిసిందే.
భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అలిపిరిలో రెండు చోట్ల 2వేల వాహనాలు, తిరుమలలో రెండు చోట్ల 1,500 వాహనాలు పార్క్ చేసేలా మల్టీలెవల్ పార్కింగ్ సముదాయాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఈవో చెప్పారు.
తితిదే కల్యాణ మండపాల లీజు కాలాన్ని 3 నుంచి 5 ఏళ్లకు, ఆ తర్వాత మరో రెండేళ్లు పొడిగించేలా విధివిధానాలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.
తిరుమలలో పర్యావరణ పరిరక్షణ కోసం గ్రీన్ ఎనర్జీ తయారు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.
భవిష్యత్తులో విద్యుత్‌తో నడిచే వాహనాలను మాత్రమే తిరుమలకు అనుమతించే విధంగా ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు.
దీనిలో భాగంగా 150 విద్యుత్ బస్సులు నడిపేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు ప్రారంభించిందన్నారు.
తితిదే అధికారులకు కూడా విద్యుత్‌తో నడిచే వాహనాలను కేటాయిస్తామన్నారు.
ఎన్టీపీసీ ద్వారా ధర్మగిరిలో 25 ఎకరాల్లో 5 మెగావాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు జవహర్‌రెడ్డి వివరించారు.