పోలీస్ స్టేషనులో దొంగతనం చేసిన కేసులో… ముద్దాయిలు అయిన వీరవాసరం కానిస్టేబుళ్ళను అరెస్ట్ చేసిన పోలీసు అధికారులు
పశ్చిమగోదావరి జిల్లా/పాలకొల్లు రూరల్
వీరవాసరం మండలంలో ఉన్న వీరవాసరం, రాయకుదురు, కొనితివాడ, నౌడూరు గ్రామాలలో ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణంలో పని చేసే సూపర్వైజర్లు బ్యాంకులకు వరస శెలవు అవ్వడం వలన ఈ నెల 15వ తేదిన సాయంత్రం 4 గంటల వరకు వారి షాపులలో మద్యం అమ్మగా వచ్చిన రూ. 8 లక్షలకు పైగా నగదు మొత్తాన్ని ఒక ట్రంక్ పెట్టెలో ఉంచి సీల్ వేసి రాత్రి 7.00 గంటలకు వీరవాసరం పోలిస్ స్టేషన్ లాకప్ గదిలో భద్రపరచారు.
తిరిగి 17వ తేదిన ఉదయం 9.00 గంటలకు పోలీసు స్టేషన్ లో భద్రపరచిన మొత్తాన్ని బ్యాంకులో జమ చేసేందుకు సదరు సూపర్వైజర్లు స్టేషన్కు వెళ్లి చూడగా లాకప్ కు వేసిన తాళం కాకుండా వేరే తాళం ఉన్న విషయం గమనించారు.
సదరు తాళాన్ని పగలకొట్టి లాకప్ లోపల ఉన్న ట్రంకు పెట్టెలో పెట్టిన నగదు కనిపించలేదు.
లాకప్ లో వుంచిన ట్రంకు పెట్టె సీల్ తొలగించి తాళం పగులకొట్టి నగదు దొంగిలించినట్లు గుర్తించారు.
దీనితో అవాక్కయిన పోలిసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
పోలీసు ప్రతిష్టకు పరీక్షలాంటి ఈ కేసులో పోలీసులే దొంగతనం చేసి వుండవచ్చును అనే దిశగా దర్యాప్తు సాగింది.
పశ్చిమ గోదావరి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ శ్రీ నారాయణ్ నాయక్ IPS, ఆదేశానుసారం నరసాపురం డిఎస్పీ. శ్రీ . పి.వీరాంజనేయ రెడ్డి గారి పర్యవేక్షణలో, పాలకొల్లు పట్టణ ఇన్స్పెక్టర్ శ్రీ సి.హెచ్. ఆంజనేయులు గారు ప్రాధమిక దర్యాప్తు చేసారు.
అనంతరం పాలకొల్లు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ డి.వెంకటేశ్వర రావు తదుపరి దర్యాప్తు కొనసాగించారు.
నేరస్తులను పట్టుకొనే క్రమంలో ఏలూరు సి.సి.యస్ డిఎస్పీ శ్రీ పైడేశ్వర రావు గారి ఆద్వర్యంలో, భీమవరం సి.సి.యస్ ఇన్స్పెక్టర్ నాగరాజు గారు, తాడేపల్లిగూడెం పట్టణ ఇన్స్పెక్టర్ ఆకుల రఘు గారు, వీరవాసరం పోలిస్ స్టేషన్ సబ్-ఇన్స్పెక్టర్ శ్రీ సి.హెచ్ రామచంద్ర రావు, ఆచంట పోలిస్ స్టేషన్ సబ్-ఇన్స్పెక్టర్ శ్రీ సి.హెచ్ రాజశేఖర్, పాలకొల్లు రూరల్ పోలిస్ స్టేషన్ సబ్-ఇన్స్పెక్టర్ శ్రీ పి.అప్పారావు, యలమంచిలి పోలిస్ స్టేషన్ సబ్-ఇన్స్పెక్టర్ శ్రీ కె.గంగాధరరావు, పోడూరు పోలిస్ స్టేషన్ సబ్-ఇన్స్పెక్టర్ శ్రీ బి. సురేంద్ర కుమార్ మరియు పాలకొల్లు రూరల్ సర్కిల్ సిబ్బందితో బృందాలగ ఏర్పరిచారు.
అధికారులు సదరు బృందాలను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ సమయానుకూల సూచనలతో సదరు బృందాలను నడిపిస్తూ, వారికి రాబడిన ఖచ్చితమైన సమాచారముతో ముద్దాయిలను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 8,04,330/- రూపాయిలు యావత్తు రికవరీ చేయడమైనది.
ముద్దాయిల వివరములు:
ఉసురుమర్తి గంగాజలం, గొర్రెల గనేశ్వర రావు అలియాస్ గణేష్, 2013లో కానిస్టేబులుగా నియమితుడయ్యాడు. అనే కానిస్టేబుళ్ళను ఈ కేసులో ముద్దాయిలుగా గుర్తించారు.
ఈ కేసులో మొదటి ముద్దాయిగా ఉన్న ఉసురుమర్తి గంగాజలం 2013లో కానిస్టేబులుగా ఉద్యోగంలో చేరారు. వృత్తి రిత్యా అనేక ప్రాంతాల్లో విధులు నిర్వర్తించిన గంగాజలం 2020లో పేకాట ఆడుతు పట్టుబడి క్రమశిక్షణా చర్యల్లో భాగంగా విధుల నుండి సస్పెండ్ చేయబడ్డాడు.
సస్పెన్షన్ తరువాత విధుల్లో తిరిగి చేరిన గంగాజలం ఫిబ్రవరిలో ఎన్నికల విధుల నిమిత్తం వీరవాసరం పోలీసు స్టేషనుకు వచ్చి అప్పటి నుండి అక్కడే విధులు నిర్వర్తిస్తున్నాడు.
అదే విధంగా అతనికి సహకరించిన గణేష్ కూడా గతంలో తాడేపల్లిగూడెంలో అవినీతి ఆరోపణలపై సస్పెండ్ కి గురై తిరిగి విధులలోకి జాయిన్ అయినాడు.
ట్రాన్సఫరులలో భాగంగా గత సంవత్సరం డిసెంబరులో వీరవాసరం పోలీస్ స్టేషనుకు వచ్చి అప్పటి నుండి అక్కడే విధులు నిర్వర్తిస్తున్నాడు.
బ్యాంకులకు వరస సెలవు కారణంతో వీరవాసరం మండలంలో గల ప్రభుత్వ మద్యం దుకాణంలో పనిచేస్తున్న సూపర్వైజర్లు దుకాణములలో వచ్చిన డబ్బులను పోలీస్ స్టేషన్ నందు భద్రపరిచారు అని తెలుసుకున్నారు వారిద్దరూ.
దొంగతనం జరిగిందిలా
ఎలాగైనా ఆ డబ్బులు కాజేయాలని నిర్ణయించుకున్నారు ఆ ఇద్దరు కానిస్టేబుళ్ళు.
వారు స్టేషన్లో పనిచేసే సమయంలో దొంగతనం చేస్తే అనుమానం వారి మీదకి వస్తుందని వారు రెస్ట్ లో ఉన్న సమయంలో దొంగతనం చేస్తే ఎవరికీ తమ మీద అనుమానం రాదు అనుకున్నారు.
16వ తేదీ రాత్రి వారు రెస్ట్ లో ఉన్న సమయంలో వారిద్దరూ అనుకున్న ప్రకారం మొదట గంగాజలం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో పోలీస్ స్టేషన్కు వచ్చాడు.
స్టేషన్ వెనుక భాగంలో ముందుగా దాచిన ఒక ఇనుప పైపు ను తీసుకువచ్చి లాకప్ గది తాళం పగలగొట్టి అందులో బాక్స్ ని బయటకు తీసుకువచ్చాడు.
సీలు చింపి ట్రంక్ బాక్స్ తాళం పగలగొట్టి అందులో నగదును తీసుకుని లాకప్ గది తాళాన్ని దగ్గరలో గల బావిలో పడవేసారు.
సీలు చింపిన కాగితాలను, బాక్సు గోళ్ళెంతో పాటు తాళంని పోలీస్ స్టేషన్ వెనుక ప్రహరి గోడ పక్కన పడవేసారు.
పక్కనే ఉన్న వేరే లాకప్ గది తాళాన్ని, పగలగొట్టిన లాకప్ గదికి యదావిధిగా ఎవరికి అనుమానం రాకుండా వేసి గణేష్ వద్దకు వెళ్లి వాటాల ప్రకారం డబ్బులు, పంచుకున్నారు.
తమ మీద అనుమానం వస్తుందేమో అన్న భయంతో ఇద్దరూ ఆ డబ్బును వీరవాసరం గ్రామంలో తూర్పు చెరువు సెంటర్ వద్ద ఉన్న అభయాంజనేయ స్వామి గుడి ఎదురుగా ఉన్న పొదలలో దాచిపెట్టారు.
అయితే గంగాజలం తాను పంచుకున్న డబ్బుతో తాను ఉంటున్న తులసి కన్వెన్షన్ సెంటర్ వద్దకు వచ్చి అక్కడ చెత్త లో సదరు డబ్బుని ఉంచి తరువాత తీసుకు వెళ్ళడం సీసీ ఫుటేజ్ ద్వారా వెల్లడయింది.
విషయం తెలిసిన సదరు కానిస్టేబుళ్ళిద్రు పరారీలో ఉండగా పాలకొల్లు రూరల్ సిఐ పక్కా సమాచారంతో ఈ రోజు ఉదయం వీరవాసరం మడుగు వంతెన వద్ద వారిద్దరిని అరెస్టు చేసారు.
వారి ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం దొంగలించిన డబ్బును, పగలగొట్టిన తాళాన్ని చింపేసిన సీలు కాగితాలన్నీ విరగ్గొట్టిన ట్రంక్ బాక్స్ తాళం మరియు గొళ్ళెంని మధ్యవర్తుల సమక్షంలో స్వాధీనపరచుకున్నారు.
ఈ కేస్ ను ఛేదించడం లో సఫలమైన అధికారులను మరియు సిబ్బందిని పశ్చిమ గోదావరి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ శ్రీ నారాయణ నాయక్ గారు అభినందించారు.