బైంసా ప్రశాంతం
భైంసా శివాజీ చౌక్‌లో బందోబస్తు నిర్వహిస్తున్న పికెట్ పోలీసులు
భైంసాలో పరిస్థితులు చక్కదిద్దేందుకు పోలీసులు అవసరమైన చర్యలు కొనసాగిస్తున్నారు.
అల్లర్లు జరిగి నాలుగు రోజులు కావస్తున్నా పోలీసు ఆంక్షలు కొనసాగుతున్నాయి.
పట్టణంలోని జాతీయ రహదారి 61 పక్కనే ఓ గ్యారేజీలో ఉన్న పాత జీపునకు గురువారం వేకువ జామున గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించారు.
గమనించిన పోలీసులు మంటలు ఆర్పివేయించి దానిని అక్కడి నుంచి తొలగించారు.
ఈ నేపథ్యంలో మహాశివరాత్రి పండగ ఉన్నప్పటికి 144 సెక్షన్ అమలుతో ఆంక్షల్లో ఎటువంటి సడలింపులు ఇవ్వలేదని తెలుస్తుంది.
జిల్లా ఎస్పీ విష్ణువారియర్ ఇక్కడే ఉండి శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నారు. డీఎస్పీ కె.నర్సింగ్‌రావు, పోలీసు అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
అంతే కాకుండా తాజా పరిస్థితులపై ఇరువర్గాల మతపెద్దలు, ప్రజాప్రతినిధులతో కలిసి ఆర్అండ్బీ అతిథి గృహంలో వేర్వేరుగా చర్చించారు.
పరారీలో ఉన్నవారి కోసం గాలింపు
భైంసా పరిస్థితులపై జిల్లా ఎస్పీ విష్ణువారియర్ గురువారం ఓ ప్రకటన జారీ చేశారు.
ఇప్పటి వరకు 21కేసులు నమోదు చేశామని, 30మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు.
ఇంకా 21మంది అనుమానితులు అదుపులో ఉన్నవారిని విచారిస్తున్నామన్నారు.
అల్లర్లకు కారకులుగా భావిస్తున్న 78 మందిని గుర్తించామని, ఇద్దరు బాల నేరస్తులు ఉన్నారన్నారు.
పరారీలో ఉన్న 36 మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు.