ఎంపీగా గెలిపించండి..మీ నమ్మకాన్ని వమ్ముచేయను…
ఆంధ్రుల ఆత్మాభిమానానికి సంబంధించిన ప్రతిష్టాత్మకమైన ఎన్నికలు ఇవి…
తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి విన్నపం…
తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక నేపథ్యంలో సర్వేపల్లి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో నెల్లూరు టీడీపీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.
మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి, పనబాక కృష్ణయ్య, కొమ్మి లక్ష్మయ్య నాయుడు, నెల్లూరు, తిరుపతి అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, నరసింహ యాదవ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, పరసా రత్నం, రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షులు, నరసింహ ప్రసాద్, పోలిశెట్టి, రావూరి రాధాక్రిష్ణమ నాయుడు, చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి, బొమ్మి సురేంద్ర, పనబాక భూలక్ష్మి, నాగేశ్వరరావు యాదవ్, కరణం శ్రీను తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పనబాక లక్ష్మి మాట్లాడుతూ
ఎన్టీఆర్ ఎప్పుడూ ఆంద్రుల ఆత్మగౌరవం గురించి పోరాడేవారని, ఈ రోజు ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని వైసీపీ ప్రభుత్వం ఢిల్లీలో తాకట్టు పెట్టిందని థ్వజమెత్తారు.
ప్రత్యేక హోదా ఇస్తానని తిరుపతిలో వెంకటేశ్వరస్వామి సాక్షిగా ఇచ్చిన మాటను ప్రధాని మోదీ తప్పారని గుర్తు చేశారు.
మోదీ ప్రభుత్వ తీరుకు నిరసనగా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రులతో రాజీనామా చేయించి, ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి పోరాటం సాగించారుని అన్నారు.
మాకు అత్యధిక ఎంపీ సీట్లు ఇవ్వండి ప్రత్యేక హాదా సాధిస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు, గెలిచి రెండేళ్లు దాటుతున్నా ఆ ఊసే లేదని దుయ్యబట్టారు.
పోరాటం చేసి సాధించుకున్న విశాఖ ఉక్కు కూడా ప్రైవేటు పరం కాబోతోందని, ఇది కూడా ఆంధ్రుల ఆత్మాభిమానానికి సంబంధించిన విషయమని ఆవేదన వ్యక్తం చేశారు.
రాజధాని అమరావతికి ప్రధాని మోదీ స్వయంగా శంకుస్థాపన చేస్తే ఈ రోజు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దానిని పట్టించుకోవడం లేదని విమర్శించారు.
ఇళ్లలో చిన్నారులు మన రాష్ట్ర రాజధాని ఏది అని అడిగితే చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నామని వాపోయారు.
వైసీపీ ప్రభుత్వం వచ్చాక కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్నవి కూడా పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయని ఎద్దేవా చాశారు.
ఉప ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే తిరుపతిని ఆధ్యాత్మిక రాజధానిగా తీర్చిదిద్దేందుకు నా వంతు ప్రయత్నం చేస్తాని హామీ ఇచ్చారు.
మన్నవరం ప్రాజెక్టు, దుగరాజపట్పం పోర్టులను తుంగలో తొక్కేశారని, గూడూరు-దుగ్గరాజపట్నం రైల్వే లైనుకు తాను సర్వే కూడా చేయిస్తే ఇప్పుడు ఆ ప్రాజెక్టు ఊసే లేదని పేర్కొన్నారు.
ప్రభుత్వం మారినప్పుడల్లా ప్రాజెక్టులు ఆపేస్తే రాష్ట్ర అభివృద్ధి ఎలాగని ప్రశ్నించారు.
ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేసి నన్ను గెలిపించండి….మీ నమ్మకాన్ని వమ్ము చేయను అంటూ కోరారు.
ఈ సమావేశంలో సోమిరెడ్డి మాట్లాడుతూ
తిరుపతి పార్లమెంటు ఎన్నికల్లో డబ్బు పంచడానికి నియోజకవర్గానికి ఒక మంత్రిని ఇన్ చార్జిగా వేశారని ఆరోపించారు.
జగన్మోహన్ రెడ్డి డబ్బులు పంపాల్సిన పరిస్థితి లేదని, ఇక్కడి నాయకులే జీర్ణించుకోలేనంతగా సంపాదిస్తున్నారని ఆరోపించారు.
స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారిగా ఎలా సంపాదించుకోవాలో చేసి చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు.
ఇసుక, మట్టి, గ్రావెల్ చివరకు బూడిదను కూడా వదిలిపెట్టడం లేదని అన్నారు.
కరోనాను కూడా వరంగా మార్చుకుని కలెక్షన్లు చేసిన నాయకులను ఇప్పుడే చూస్తున్నామని వాపోయారు.
మద్యం కంపెనీల కమీషన్ల కోసం ప్రజల ఆరోగ్యాన్నే పణంగా పెడుతున్నారని, మా సర్వేపల్లిలో తయారు చేసిన మందు తాగిన వారికి పది రోజుల్లోనే పక్షవాతం వచ్చి పొగతోట ఆస్పత్రుల్లో చేరుతున్నారంట అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నికల్లో డబ్బులు ఇస్తారు, బెదిరిస్తారు, మనం మాత్రం పోరాటం చేయాలి అని కార్యకర్తలకు సూచించారు.
ఎంత మంది మీద కేసులు పెట్టుకుంటారో పెట్టుకోమనండి, ప్రజా సమస్యల పోరాటం విషయంలో మాత్రం వెనక్కి తగ్గం అని స్పష్టం చేశారు.
టీడీపీ హయాంలో ఐదేళ్లు అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేసి 1.30 లక్షల కోట్లు అప్పు చేస్తే, వైసీపీ ప్రభుత్వం ఒక్క పనిచేయకుండా రెండేళ్లలోనే 1.70 లక్షల కోట్లు అప్పు చేసింది…
అభివృద్ధి లేదు..వృద్ధి రేటు పడిపోయింది..పెట్టుబడులు రావడం లేదు..
అసలు ఈ రాష్ట్రం ఎక్కడికి పోతుంది, భవిష్యత్ తరాల వారి పరిస్థితి ఏంటో ఆలోచించండి, అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్ఆర్ఈజీఎస్ పనులు చేసిన వారికి బిల్లులు చెల్లించకుండా ఆపేశారని, గ్రామస్తుల అవసరాలు తీర్చేందుకు అప్పులు తెచ్చి పనులు చేసినోళ్లు చితికిపోయారని ఆరోపించారు.
151 సీట్లతో అధికారం ఇచ్చింది ఇలాంటి పనులు చేయడానికా…
2018 నుంచి చేసిన ఎన్ఆర్ఈజీఎస్ పనులకు రూ.2250 కోట్లు కేంద్రం విడుదల చేస్తే రెండున్నరేళ్లు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నిధులు చెల్లించకపోతే బీజేపీ నేతలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
పొదలకూరు మండలంలో కండలేరు లిఫ్ట్ కింద మేం 2 వేల ఎకరాలకే నీళ్లు ఇచ్చామని అసత్య ప్రచారం చేయడం తగదని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు.
చేజర్ల మండలం గాలిపాళెం నుంచి మొదలైతే తోడేరు, మరుపూరు, చాటగొట్ల దాటి వెంకటాచలం మండలం పారిచెర్లపాడు వరకు 25 వేల ఎకరాలకు నీళ్లు అందించామని స్పష్టం చేశారు. ఎండిపోయే పంటలు కాపాడామని, నిమ్మతోటలను బతికించామని, భూగర్భ జలాలు పెంచామని తెలియజేశారు.
కండలేరు ఎడమకాలువకు 30 కోట్లతో లైనింగ్ దేనికి…మీరు తినడానికా…
లైనింగ్ తో భూగర్భ జలాలు పడిపోతాయి, ఏమైనా ఆకుపడితే కాలువలో మిషన్ దిగలేదు, పూడిక తీయలేరు,
30 ఏళ్లుగా పనులు జరగక కర్రతుమ్మ చెట్లు పట్టిన సోమశిల దక్షిణ కాలువ పనులు మేం చేపట్టాం, ఈ రోజు మీరొచ్చి ఆ పనులూ ఆపేశారు అంటూ ప్రభుత్వం పనితీరుపై విమర్శలు గుప్పించారు.
పేదోళ్లు మినరల్ వాటర్ తాగుతారా, అంటూ పొదలకూరులో రూ.4.69 కోట్లతో ప్రారంభించిన మెగా వాటర్ ప్లాంట్ ను మూలనపెట్టేశారని ధ్వజమెత్తారు.
పంచాయతీ ఎన్నికల్లో చదువురాని గిరిజనులను భయపెట్టేందుకు వలంటీర్లు వైసీపీకి పనికొచ్చారని, రేపు పార్లమెంటు ఎన్నికల సందర్భంగా వారి ఆటలు సాగనీయమని ఈ సందర్భంగా ఆయన అన్నారు.
కేంద్ర మంత్రిగా, ఎంపీగా పనిచేసిన పనబాక లక్ష్మిగారు సౌమ్యురాలు, నిజాయతీకి మారు పేరు, ప్రతి ఒక్కరం కష్టపడి పనిచేద్దాం, తిరుపతి ఎంపీగా ఆమెను గెలిపించుకుందాం అని కార్యకర్తలకు విఙప్తి చేశారు.



