రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఈ బందును జయప్రదం చేయండి – రైతు సంఘాల సమన్వయ రాష్ట్ర కమిటీ
విశాఖ ఉక్కు పరిరక్షణకు ఈ నెల 5న విశాఖ ఉక్కు పరిరక్షణా పోరాట వేదిక ఆధ్వర్యంలో చేపట్టనున్న రాష్ట్ర బందుకు మద్దతు తెలుపుతున్నట్లు ఏపీ రైతు సంఘాల సమన్వయ కమిటీ ప్రకటించింది.
ఈ మేరకు కమిటీ రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు, కమిటీ మెంబెర్లతో కలిసి విజయవాడ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం మంగళవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా శోభనాద్రీశ్వరరావు, వై.కేశవరావు, రావుల వెంకయ్య మాట్లాడుతూ ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమం 100 రోజులు పూర్తయిన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా గ్రామ గ్రామాన సంయుక్త కిసాన్ మోర్చా పతాకాలు ఎగురవేసి, 100 కొవ్వొత్తులు వెలిగించాలని రైతు సంఘాల సమన్వయ కమిటీ నిర్ణయించిందని అన్నారు.
అన్ని జిల్లాల్లోని అన్ని సంఘాలూ చర్చించుకుని 5న రాష్ట్ర బంద్, 6న కిసాన్ పతాక ఆవిష్కరణ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.
సమన్వయ కమిటీ సమావేశాన్ని 12న జరపాలని, 23న భగత్ సింగ్ వర్ధంతి కార్యక్రమాన్ని రూపొందించుకోవాలని నిర్ణయించినట్లు వివరించారు.
ఈ విలేకరుల సమావేశంలో ఆళ్ల వెంకట గోపాలకృష్ణ, నరహరిశెట్టి నరసింహారావు, కె.వి.వి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.