విశాఖపట్నం వాల్తేరులో గల పోలమాంబ ఆలయంలో శనివారం అర్ధరాత్రి కొందరు గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు.
నిత్యం బంగారు వెండి ఆభరాణలతో అలంకృతమయ్యే అమ్మవారి గుడిలో గత రాత్రి జరిగిన చోరీలో అమ్మవారి వెండి కిరీటం, బంగారు ఆభరణాలతో పాటు వెండి పాజా సామాగ్రిని సయితం దుండగులు దోచుకెళ్ళారు.
ఈ ఉదయం ఆలయానికి వచ్చిన ఆలయ సిబ్బంది గర్భాలయ తాళం పగులగొట్టడం గమనించడంతో చోరీ విషయం వెలుగులోకి వచ్చింది.
గమనించిన వెంటనే ఆలయ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించగా ఘటనపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు పోలీసులు.
కాగా, ప్రభుత్వ వైఫల్యం వల్లే విశాఖలోని కరకచెట్టు పోలమాంబ ఆలయంలో చోరీ జరిగిందని, వైసీపీ సర్కారు పాలనలో ప్రజలతోపాటు, దేవుళ్లకి కూడా రక్షణ లేకుండా పోయిందని విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ ఆరోపించారు.
కోరిన కోర్కెలు తీర్చే అమ్మవారిగా ప్రసిద్ధిగాంచిన పోలమాంబ ఆలయంలో చోరీతో భక్తులు తీవ్ర ఆందోళనలో వున్నారని ఆయన ఈ సందర్భంగా అన్నారు.

జగన్రెడ్డి పాలనలో గుడులపై దాడులు సర్వసాధారణమయ్యాయని, ఉత్తరాంధ్ర అయోధ్యగా పేరుగాంచిన రామతీర్థంలో దుండగులు రాముడి తల తీసేశారని, ఇప్పుడు పోలమాంబ గుడిలో దోపిడీకి పాల్పడ్డారని అన్నారు.
ప్రభుత్వం ఉదాసీనత వల్లే హిందూమత వ్యతిరేకశక్తులు రెచ్చిపోతున్నారని ఘాటుగా విమర్శించారు.
ఈ విషయంపై కఠినమైన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఇతర మతాల దేవుళ్ళపైన కూడా ఇటువంటి దాడులు జరిగే ప్రమాదం ఉంటుందని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నట్లు ఆయన ఈ సందర్భంగా అన్నారు.