సంగం మండలం దువ్వూరులో రోడ్డు ప్రమాద మృతుల కుటుంబీకులను మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, మండల నాయకులు పరామర్శించారు.
బాధిత కుటుంబాలకు తనవంతు సాయంగా బొమ్మిరెడ్డి ఇచ్చిన నగదు చెక్కులను వారికి అందజేసిన సోమిరెడ్డి…
ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ, రెక్కాడితే కానీ డొక్కాడని పేద దళితులు ఆరుగురు ఒకే ప్రమాదంలో మృతిచెందడం బాధాకరమని అన్నారు.
మృతుల ఆత్మకు శాంతిచేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానని ఆయన అన్నారు.
ఇంటి పెద్దలను కోల్పోయి దయనీయ పరిస్థితిలో ఉన్న దళిత కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా చెల్లించే విషయంలో ప్రభుత్వం స్పందించకపోవడం అన్యాయమని ధ్వజమెత్తారు.
ఫిబ్రవరిలో అజ్మీర్ యాత్రకు వెళుతూ కర్నూలు జిల్లాలో జరిగిన ప్రమాదంలో మదనపల్లి వాసులు చనిపోతే తక్షణ సాయంగా రూ.2 లక్షలు వంతున ఎక్స్ గ్రేషియా చెల్లించారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
కూలికిపోతూ ప్రమాదానికి గురై చనిపోయిన దువ్వూరు దళితులకు రూ.5 లక్షలు చొప్పున ఎక్స్ గ్రేషియా చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఎక్స్ గ్రేషియా చెల్లింపునకు చర్యలు తీసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే అయిన మంత్రి గౌతమ్ రెడ్డిని కోరారు.
ఇలాంటి కష్టాలు ఎదురైనప్పుడు గతంలో చంద్రన్న బీమా బాధిత కుటుంబాలకు ఎంతోకొంత అండగా నిలిచేదని ఆయన అన్నారు.
ఒకవేళ చంద్రన్న పేరు మార్చుకుని ఇంకో పేరుతో అయినా పథకం కొనసాగించివుంటే ఈ బాధిత కుటుంబాలన్నింటికి రూ.5 లక్షల వంతున పరిహారం అందివుండేదని వాపోయారు.
బీమా ప్రీమియం రెండేళ్లపాటు ఈ ప్రభుత్వం చెల్లించకపోవడం దురదృష్టకరమని అన్నారు.
ప్రీమియం నిన్న చెల్లించామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది..ఈ లోపు బాధితులకు జరిగిన అన్యాయానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని పేర్కొన్నారు.
ముంబై రహదారిపై తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, దువ్వూరు వద్ద ప్రమాదం జరిగిన వారం రోజులకే దామరమడుగు వద్ద మరో ఘటన చోటుచేసుకుని 8 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు.
ప్రమాదాలు జరగకుండా హైవేపై పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది..