నెల్లూరు జిల్లా మనుబోలు, కొమ్మలపూడి:- ఫ్యాక్టరీలకు భూములిచ్చింది స్థానికులే, వాటి కాలుష్యాన్ని భరిస్తున్నదీ స్థానికులే, ఇప్పుడు ధరల భారం కూడా వారి పైనేనా?
వంట నూనెలను జిల్లావాసులకు లీటర్ రూ.80కే అందించాలి, ఆ దిశగా జిల్లా అధికారులు చర్యలు చేపట్టాలని మనుబోలు, కొమ్మలపూడి పర్యటనలో ఉన్న మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో ధరలు విపరీతంగా పెరిగిపోయాయని మండిపడ్డారు.
టీడీపీ హయాంలో రూ.80గా ఉన్న లీటర్ పామాయిల్ ఇప్పుడు రూ.160కి చేరిందని దుయ్యబట్టారు.
జిల్లాలోనే ఉత్పత్తి అవుతున్న వంట నూనెల ధరలను ఇంత భారీగా పెంచడం దురదృష్టకరమని వాపోయారు.
ఏ కారణం లేకుండా ధరలు భారీగా పెరిగిపోతుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
పామాయిల్ ఫ్యాక్టరీల యాజమాన్యాలతో కలెక్టర్, ఎస్పీ, తదితర జిల్లా అధికారులు చర్చలు జరపి స్థానికులకు అందుబాటు ధరలలో వంట నూనె లభించేలా చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
ఉత్పత్తి ధరపై నామమాత్రపు మార్జిన్ నే జిల్లా వాసుల వద్ద వసూలు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఓడరేవులకు, ఫ్యాక్టరీలకు భూములిచ్చిందే కాక కాలుష్యాన్ని కూడా స్థానికులు భరిస్తున్నారని, తిరిగి ధరల భారం కూడా మా ప్రజలపైనేనా అని సోమిరెడ్డి ప్రశ్నించారు.
ఇతర జిల్లాలు, పొరుగు రాష్ట్రాల్లో వ్యాపారాలు మాకు అనవసరం, జిల్లా వాసులకు లీటర్ పామాయిల్ రూ.80కి అందేలా వెంటనే చర్యలు చేపట్టాలి అని ఆయన డిమాండ్ చేశారు.
ప్రతిపక్ష నాయకుడిగా ధరల పెరుగుదలపై గగ్గోలు పెట్టిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడేం చేస్తున్నారని ప్రశ్నించారు.
గ్యాస్, పెట్రో ఉత్పత్తులపై ఇతర రాష్ట్రాలకన్నా ఏపీలో ఎక్కువ పన్నులు విధించి జనంపై భారం వేస్తున్నారన్నారు.
ఈ రాష్ట్రంలో ధరలు పెరగని వస్తువు ఏమైనా ఉందా అంటే, అది రైతులు పండించిన ధాన్యమేనని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.