హైదరాబాద్ శివారులో రేవ్ పార్టీ .. పోలీసుల అదుపులో 90మంది యువతీయువకులు
హైదరాబాద్: నగర శివారులో ఒక రేవ్ పార్టీని భగ్నం చేశారు ఎస్ఓటీ పోలీసులు.
నల్గొండ జిల్లా సంస్థాన్ నారాయణపూర్ లో జరుగుతున్న రేవ్ పార్టీ పై దాడి చేసిన పోలీసులు పెద్ద సంఖ్యలో అబ్బాయిలు, అమ్మాయిలను అరెస్ట్ చేశారు.
రాచకొండ పోలీస్ కమిషనరేట్ కు సంబంధించిన ఎస్ఓటీ పోలీసులకు అందిన సమాచారంతో దాడులు నిర్వహించి రేవ్ పార్టీ నిర్వహిస్తున్న తొంభై మంది యువకులను అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది.
ఈ 90 మందిలో యువకులతో పాటుగా ఈ పార్టీలో ఉన్న అమ్మాయిలను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు.
ఫామ్ హౌస్ లో రేవ్ భగ్నం చేసిన పోలీసులు
సంస్థాన్ నారాయణపూర్ లో ఒక వ్యక్తికి చెందిన ఫామ్ హౌస్ లో గుట్టుచప్పుడు కాకుండా రేవ్ పార్టీ నిర్వహిస్తున్నారు.
అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఇక్కడ రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నారని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో దాడి చేసిన పోలీసులు రేవ్ పార్టీని భగ్నం చేశారు.
రేవ్‌పార్టీ నిర్వాహకులతో పాటుగా ఇందులో పాల్గొన్న యువకులను, యువతులను అరెస్ట్ చేసిన పోలీసులు వారు ఎక్కడి నుంచి వచ్చారు? ఎంత కాలం నుంచి ఈ వ్యవహారం నడుస్తోంది? ఎలా ఈ రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నారు అన్నదానిపై విచారణ జరుపుతున్నారు.
90 మంది యువతీయువకులు అరెస్ట్ , 60 బైక్ లు , 20 కార్లు సీజ్
పోలీసులు దాడి చేసిన సమయంలో పదిమంది యువకులు అక్కడి నుంచి పరారైనట్లుగా తెలుస్తుంది. పరారైన యువకుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
ఈ రేవ్ పార్టీలో పట్టుబడిన యువకులతో పాటుగా యువతులను కూడా విచారిస్తున్న పోలీసులు, పార్టీ జరిగిన ప్రాంతంలో భారీగా మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
రేవ్ పార్టీ జరిగిన ఫాంహౌస్ వద్ద 60 బైక్ లను, 20 కార్లను సీజ్ చేసిన పోలీసులు ఘటనా స్థలంలో పెద్దమొత్తంలో ఇతర సామాగ్రి కూడా ఉన్నట్లుగా చెబుతున్నారు.
హైదరాబాద్ శివారులో జోరుగా సాగుతున్న రేవ్ పార్టీలు
తప్పతాగి యువతీ యువకులు అశ్లీల నృత్యాలు చేస్తున్నట్లుగా, ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నట్టుగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
ఈ మధ్యకాలంలో హైదరాబాద్ శివారులో రేవ్ పార్టీల కల్చర్ విపరీతంగా పెరిగిపోయింది.
ముఖ్యంగా హైదరాబాద్ నల్గొండ శివారు రిసార్ట్స్ లో, ఫామ్ హౌస్‌లలో ఈ రేవ్ పార్టీలు జోరుగా సాగుతున్నాయన్న సమాచారంతో పోలీసులు ఈ రిసార్ట్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు.