యానాం ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ సీఎం రంగస్వామి…
యానాం: పుదుచ్చేరి శాసనసభ ఎన్నికల్లో భాగంగా యానాం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ సీఎం ఎన్.రంగసామి బరిలోకి దిగుతున్నట్లు మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు ప్రకటించారు.
స్థానిక అగ్నికుల క్షత్రియ కల్యాణ మండపంలో ఆదివారం జరిగిన సభలో మల్లాడి మాట్లాడారు. కాంగ్రెస్లో కొనసాగుతున్న ఆయన.. తన మద్దతుదారులతో కలిసి ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీలో భేషరతుగా చేరుతున్నట్లు ప్రకటించారు.
ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్న ఎన్ఆర్ కాంగ్రెస్.. ప్రస్తుత ఎన్నికలలో భాజపా, అన్నాడీఎంకే కూటమితో కలిసి పోటీ చేస్తోంది.
మరోవైపు ఎన్డీయే కూటమి తరఫున సీఎం అభ్యర్థిగా రంగస్వామి బరిలో ఉండనున్న తరుణంలో యానాం నుంచి ఆయన్నే పోటీకి దింపనున్నట్లు మల్లాడి చేసిన ప్రకటనతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
ఈ ఏడాది జనవరిలో 25 ఏళ్లు ఎమ్మెల్యేగా రాజకీయ రజతోత్సవ సత్కారాన్ని అందుకున్న మల్లాడి.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని ముందు నుంచే ప్రకటిస్తూ వచ్చారు.
తనకంటే మంచి వ్యక్తిని నిలబెడతానని, పది రెట్లు ఎక్కువగా యానాం అభివృద్ధి చెందేలా తన నిర్ణయం ఉంటుందని పేర్కొనేవారు.
చెప్పిన విధంగానే సీఎం అభ్యర్థిని యానాం నుంచి పోటీకి నిలుపుతున్నట్లు ప్రకటించారు.
రంగస్వామి యానాం వచ్చి నామినేషన్ వేసి ఒక్కసారి రోడ్డుషోలో పాల్గొంటే చాలని.. డబ్బు, మద్యం అవసరం లేకుండా భారీ ఆధిక్యతతో గెలిపించి తీరుతామని మల్లాడి చెప్పారు.
యానాంలోని రాజకీయ పార్టీలు ఈ ఎన్నికల్లో రంగస్వామిని ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.