ఆంధ్రరాష్ట్రాన్ని కేంద్రప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని ఆంధ్రప్రదేశ్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పేడాడ రమణి కుమారి ఆవేదన వ్యక్తం చేసారు.
శనివారం పీసీసీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజానాథ్ ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు ప్రవేటీకరణకు వ్యతిరేకంగా దేశరాజధాని ఢిల్లీలో ఏపీ భవన్ వద్ద చేపట్టిన ధర్నా కార్యక్రమానికి మద్దతుగా రమణి కుమారి ఒక ప్రకటన విడుదల చేసారు.
ఆంధ్రప్రదేశ్ కు అడుగడుగునా అన్యాయంచేస్తున్నారని ఆ ప్రకటనలో విమర్శించారు.
ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేవిధంగా విశాఖ ఉక్కును వంద శాతం ప్రవేటీకరణకు పూనుకొంటున్నామని కేంద్ర ఆర్ధికశాఖా మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించడం బీజేపీ ప్రభుత్వ నిరంకుశ విధానాలకు అద్దంపడుతోందన్నారు.
పార్లమెంట్ సాక్షిగా ప్రకటించిన విభజన హామీలను తుంగలోకి తొక్కారని మండిపడ్డారు.
న్యాయబద్దంగా ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయంగా బీజేపీ నేతలు ప్రకటిస్తున్నారన్నారు.
పోలవరానికి రావాల్సిన నిధులను కూడా ఇవ్వకుండా అన్యాయంచేస్తున్నారన్నారు.
రైల్వే జోన్, మెట్రో రైల్ ఊసే ఎత్తటం లేదని విమర్శించారు.
ప్రత్యేక హోదా, రైల్వే జోన్, విశాఖ ఉక్కు పై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు.
న్యాయబద్దంగా రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులను, హక్కుల కోసం పోరాటం చెయ్యాల్సిన జగన్ స్వంత ప్రయోజనాలకోసం మోడీ ముందు మోకరిల్లుతున్నారని రమణి కుమారి దుయ్యబట్టారు.
కాంగ్రెస్ శాంతియుతంగా నిరసన తెలుపుతుందని, ప్రత్యేక హోదా సాధించేంత వరకూ, విశాఖ ఉక్కు ప్రవేటీకరణ రద్దుచేసేంతవరకు కాంగ్రెస్ పోరాడుతుందని తెలిపారు.