పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై భగ్గుమన్న వామపక్షాలు
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక తాడితోట జంక్షన్ లో భారీ ఎత్తున ధర్నా చేపట్టారు
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై భగ్గుమన్న వామపక్షాలు
-విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని కార్మిక సంఘాలు రాస్తారోకో
సామాన్యుడిపై గుదిబండ
-వామపక్ష నేతలు తాటిపాక మధు, టి. అరుణ్, నల్లా, మూర్తి, ఎ.వి.రమణ, జోజి
రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 26: ఆకాశమే హద్దుగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు క్రమక్రమంగా పెంచడాన్ని నిరసిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో జిల్లాలో పెద్దయెత్తున ఆందోళన జరిగింది. కేంద్ర కార్మిక సంఘాలు పిలుపు మేరకు విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం రాజమహేంద్రవరం తాడితోట సెంటర్లో శుక్రవారం ఉదయం సుమారు అరగంట సేపు ఎఐటియుసి, సిఐటియు, ఐఎఫ్ టియు, ఐఎఫ్టియు 2, లారీ ఓనర్స్ అసోసియేషన్, టాక్సీ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్, సిపిఐ, సిపిఎం, సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. కొద్దిసేపు వామపక్షాల నాయకులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. రాస్తారోకో విరమించే ప్రసక్తే లేదని, ఈ ఆందోళన ప్రజల కోసమే చేస్తున్నామని వామపక్ష నేతలు తెగేసి చెప్పారు. అనంతరం తాడితోట సెంటర్ నుండి స్టేడియం రోడ్డు మీదుగా శ్యామలా సెంటర్ వరకు ప్రదర్శన సాగింది.
ఈసందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, సిపిఎం జిల్లా కార్యదర్శి టి. అరుణ్, ఎఐటియుసి జిల్లా అధ్యక్షులు నల్లా రామారావు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ మూర్తి, న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు ఏవి రమణ, కె.జోజి మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపు కారణంగా సామాన్యుల పై పెను భారం పడుతుందని, తాజాగా సిలిండర్ పై మరో రూ.25 పెంచడం దారుణమని, ధరల పెంపు సామాన్యులపై గుదిబండగా మారిందని అన్నారు. ఈ ధరల పెంపు ప్రభావం ఉల్లి పాయలు కొనాలన్నా కన్నీరు తెప్పిస్తుందని, దీంతో సామాన్యుడి బతుకు భారంగా మారుతుందన్నారు. చాలా రాష్ట్రాలు సబ్సిడీ భరిస్తూ ప్రజలకు కొంత ఊరటనిస్తున్నాయని, అయితే. ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు చర్యలు తీసుకుని ధరలు తగ్గేవిధంగా చూడాలన్నారు.
ప్రజలు బలిదానాలు, త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తే మోడీకి రాజకీయ సమాధి ఖాయమని వారు అన్నారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపగలిగే శక్తి ముఖ్యమంత్రి జగనకు ఉందని, ఆయన అందర్నీ కలుపుకుని ఢిల్లీకి తీసుకువెళ్ళి ఉద్యమానికి తోడ్పాటునందించాలన్నారు. ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గత 21 రోజులుగా పోరాడుతున్నా కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం చలనం లేకపోవడం అన్యాయమన్నారు. సెయిల్, అదానీ, టాటా, జిందాల్ వంటి ప్రైవేటు కర్మాగారాలకు స్వంత గనులు కేటాయించిన ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంటుకు మాత్రం స్వంత గనులు కేటాయించకుండా వివక్ష చూపడం వలనే నష్టాలు చోటు చేసుకున్నాయన్నారు. ఈ ఆలోచన వెనక్కి తీసుకోకపోతే మార్చి 1న విశాఖ పట్నం వస్తున్న మోడీకి నిరసన సెగ తప్పదని, గోబ్యాక్ మోడీ అంటూ నిరసన కార్యక్రమం చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో జట్ల లేబర్ యూనియన్ అధ్యక్షులు కూండ్రపు రాంబాబు, సిపిఐ నాయకులు నల్లా భ్రమరాంబ, సేపేని రమణమ్మ, యడ్ల లక్ష్మి, ఉమా, మొగల్ జీనత్ బేగం, గౌరీ, సిడగం నౌరోజీ, వానపల్లి సూర్యనారాయణ, ముప్పన వీరభద్రరావు, జిఏ రామారావు, కిర్ల కృష్ణ, పెంటు దేముడు, గొంతి వెంకటరావు, రెడ్డి వెంకటరావు, సిపిఎం నాయకులు పోలిన వెంకటేశ్వరరావు, తులసి, పవన్, పూర్ణిమారాజ్, ముచ్చకర్ల సత్యనారాయణ, కాశాని శంకరరావు, ఎవివి సత్యనారాయణ, వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.