కాపునేత కంఠంశెట్టి సత్తిబాబు కోవిడ్ తో మృతి..
మండపేట: మండపేట పట్టణానికి చెందిన వై ఎస్ ఆర్ సి పి నాయకుడు, కాపునేత కంఠంశెట్టి సత్తిబాబు శుక్రవారం తెల్లవారుజామున చెన్నైలో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
ఆయనకు భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వైసిపి ఆవిర్భావం నుండి పార్టీలో చురుకైన నాయకుడిగా ఆయన పని చేశారు.
మండపేట అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి తోట త్రిమూర్తులకు ముఖ్య అనుచరుడిగా ఆయన నియోజకవర్గంలో తనదైన ముద్రను వేసుకున్నారు.
పది రోజుల క్రితం చెన్నైలో తమ కుమార్తెను చూడటానికి వెళ్ళిన సత్తి బాబు అక్కడ కోవిడ్ బారిన పడి అస్వస్థతకు గురయ్యారు.
సత్తిబాబు మరణవార్త తెలిసిన వెంటనే పట్టణంలో ప్రముఖులు తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు.
చురుకైన కార్యకర్తగా, నాయకుడిగా చురుకైన పాత్ర పోషించే సత్తిబాబు మరణం వైయస్సార్సీపి కి తీరని లోటని తోట త్రిమూర్తులు అన్నారు.
ఆయన మృతి పట్ల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.
కంఠంశెట్టి సత్తిబాబు అకాల మరణం బాధాకరం..వేగుళ్ల లీలాకృష్ణ..
సత్తిబాబు ఆకస్మిక మృతి పట్ల జనసేనపార్టీ మండపేట నియోజకవర్గ ఇంచార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ సంతాపం వ్యక్తం చేశారు.
ఆయన మృతి పట్ల జనసేన నియోజకవర్గ అధికార ప్రతినిధి శెట్టి రవి పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా లీలాకృష్ణ మాట్లాడుతూ సత్తిబాబు తనకు అత్యంత ఆత్మీయులని పేర్కొన్నారు. మంచి మనిషిగా పేరొంది ఉజ్వల భవిష్యత్ ఉన్న నాయకుడు మృతి తనను కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని ఆ భగవంతున్ని ప్రార్ధించారు.