లాక్డౌన్ అంటూ నకిలీ జీవో.. చార్టర్డ్ అకౌంటెంట్ అరెస్ట్
హైదరాబాద్: కరోనా కేసులు పెరుగుతుండడంతో తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ అమలు చేస్తున్నట్లు నాలుగు రోజులు క్రితం ఒక ఫేక్ జీవో సోషల్ మీడియా లో వైరల్ అయింది.
ఈ నకిలీ జీవో పై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఆ ఫేక్ ఇన్ఫర్మేషన్ ను వాట్సాప్ లో షేర్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ కేసుపై సీపీ అంజనీ కుమార్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. నెల్లూరు జిల్లాకు చెందిన శ్రీపతి సంజీవ్ కుమార్ అనే ఓ చార్టర్డ్ అకౌంటెంట్ ఈ ఫేక్ న్యూస్ వైరల్ చేశాడని తెలిపారు.
ఈ నెల 1 వ తేదీన ఆన్లైన్లో ఓ జీవో ను డౌన్లోడ్ చేసుకొని , దాన్ని మార్ఫింగ్ చేసి ఈ నకిలీ జీవో ను సృష్టించాడని, ఆ తర్వాత వాట్సప్ గ్రూప్ లో షేర్ చేశాడని తెలిపారు.
నిందితుడు శ్రీపతి సంజీవ్ కుమార్ ను టాస్క్ ఫోర్స్ , సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారన్నారు. 1800 సెల్ ఫోన్స్ ను ఎగ్జామినేషన్ చేసి ఈ కేసును ఛేదించామని అన్నారు.
ఇలాంటి ఫేక్ న్యూస్ ను షేర్ చేయకూడదని , దీని వల్ల ప్రజలు ఆందోళనలకు గురయ్యే అవకాశం ఉందని సీపీ అన్నారు.
స్మార్ట్ ఫోన్లు వాడేవారు కూడా సోషల్ మీడియా లో వచ్చే వార్తలు నిజమా.. కాదా.. అని నిర్ధారించుకున్న తరువాతే ఇన్ఫర్మేషన్ ను ఫార్వార్డ్ చేయాలన్నారు.
ఇలాంటి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడం వలన బిజినెస్ లు దగ్గర నుండి లా అండ్ ఆర్డర్ వరకు ప్యానిక్ అయ్యే అవకాశం ఉందని అన్నారు.
ఇలాంటి వాటి పై అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నామన్నారు.
పోలీస్ రీక్యూట్ మెంట్ బోర్డ్ కి చెందిన ఓ ఫేక్ జీవో ను కూడా వైరల్ చేశారని, దానిపై కూడా చర్యలు తీసుకుంటామని సీపీ అన్నారు.