నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
సర్పంచ్ సహా భార్య, పిల్లలు దుర్మరణం
నిడమనూరు: నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం ఓ కుటుంబం పాలిట మృత్యు శాసనమైంది.
చిన్నారులతో సహా శుభకార్యానికి బయలుదేరిన ఆ దంపతులు మార్గంమధ్యలోనే విగతజీవులయ్యారు.
తీవ్రంగా గాయపడిన చిన్నారులు చికిత్స పొందుతూ మృతిచెందారు.
లారీ బీభత్సంతో ఒకే కుటుంబంలో నలుగురు మృత్యువాత పడటం అంతులేని విషాదాన్ని నింపింది.
నిడమనూరులో శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంతో మృతుల స్వగ్రామం తెప్పలమడుగు శోకసంద్రంలో మునిగిపోయింది.
వివరాల్లోకి వెళ్తే.. మిర్యాలగూడ నుంచి బియ్యం లోడుతో వస్తున్న ఓ లారీ నిడమనూరు వద్ద ఎదురుగా పుచ్చకాయల లోడుతో వస్తున్న టాటా ఏస్ వాహనాన్ని బలంగా ఢీ కొట్టింది.
ప్రమాదం ధాటికి ఆ వాహనం పక్కకు ఒరిగింది. అదే సమయంలో వెనుకే వస్తున్న ద్విచక్ర వాహనంపైకి టాటా ఏస్ దూసుకెళ్లింది.
ఈ ఘటనలో ద్విచక్రవాహనంపై ఉన్న తెప్పలమడుగు గ్రామ సర్పంచ్ తరి శ్రీనివాస్ (34), అతడి భార్య విజయ (30) అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.
వారితోపాటే ఉన్న కుమార్తె శ్రీవిద్య (5), కుమారుడు కన్నయ్య (3)కు తీవ్ర గాయాలయ్యాయి.
చిన్నారులను స్థానికులు హుటాహుటిన మిర్యాలగూడ ఆస్పత్రికి తరలించారు.
అక్కడ చికిత్స పొందుతూ చిన్నారులు మృతి చెందారు. టాటా ఏస్ వాహనంలో ఉన్న వారిలో ముగ్గురు గాయపడగా వారికి మిర్యాలగూడలోనే చికిత్స అందిస్తున్నారు.
సమాచారం అందుకున్న డీఎస్పీ వెంకటేశ్వరరావు, హాలియా సీఐ వీరా రాఘవులు, స్థానిక ఎస్సై కొండల్ రెడ్డి ఘటనాస్థలిని పరిశీలించారు.
లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడని, మృతదేహాలను ఆస్పత్రికి తరలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.
ముప్పరంలోని విజయ పుట్టింట్లో ఓ శుభకార్యం ఉండటంతో అక్కడికి వెళ్తుండగా ఈ విషాదం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు.