ప్రతి ఒక్కరూ కరోనా కట్టడికి చర్యలు చేపట్టాలి
శ్రీకాకుళం, ఏప్రిల్ 20 : జిల్లాలో ముఖ్యంగా శ్రీకాకుళం, పలాస, రాజాం, పాలకొండ, టెక్కలి తదితర పట్టణ ప్రాంతాల్లో కరోనా తీవ్రత అధికంగా ఉందని జిల్లా కలెక్టర్ జె నివాస్ తెలిపారు.
మంగళవారం ఉదయం 9 గంటల నాటికి అందిన నివేదిక ప్రకారం 1,344 కేసులు నమోదయ్యాయని ఆయన చెప్పారు.
జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ఆస్పత్రులలో ప్రవేశాలు పెరుగుతున్నాయని అన్నారు. ప్రతి ఒక్కరూ కరోనా కట్టడికి చర్యలు చేపట్టాల్సిన అవసరం వచ్చిందని స్పష్టం చేశారు.
మాస్కు విధిగా ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, చేతులను తరచూ శుభ్రం చేసుకోవాలని ఆయన అన్నారు.
మాస్కు ధరించని వారిపై 100 రూపాయలు అపరాధ రుసుమును విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
వేడుకలు చేసుకోవద్దని వేడుకలకు హాజరు కాకుండా ఉండాలని ఆయన అన్నారు. వివాహ మహోత్సవాలు సైతం ఉన్న సామర్థ్యంలో 50 శాతం వరకు మాత్రమే హాజరు ఉండాలని ఆయన స్పష్టం చేశారు.
ఈ విషయంపై తహసీల్దార్లను అప్రమత్తం చేశామని, నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు.
సినిమా హాల్లో సైతం ఒక సీట్ కి ఒక సీట్ కి మధ్య విధిగా ఖాళీ ఉండాలని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవడం తప్పదని ఆయన అన్నారు.
కోవిడ్ పెరుగుతున్న దృష్ట్యా ఆస్పత్రుల్లో బెడ్ల సంఖ్య పెంచుతున్నామని, ఇప్పటివరకు కొరత లేదని ఆయన పేర్కొన్నారు.
ఇటీవల కాలంలో ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య పెరుగుతుందని, ఒకేసారి ఎక్కువ సంఖ్యలో వస్తే వారందరికీ కేటాయింపుల్లో కొంత జాప్యం జరిగే అవకాశం ఉంటుందని, ప్రతి ఒక్కరూ జాగ్రత్త చర్యలు పాటించడమే మంచిదని ఆయన తెలిపారు.
కరోనా పరీక్షలు రోజుకు ఐదు వేలు చేయుటకు సామర్థ్యాన్ని పెంపుదల చేశామని ఆయన చెప్పారు. శ్రీకాకుళంలో మంగళవారం వెయ్యి పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసినట్లు కలెక్టర్ తెలిపారు.
జిల్లాలో ఫీవర్ సర్వే జరుగుతుందని కోవిడ్ లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరూ పరీక్షలు చేయించుకోవాలని తమ సమస్యను స్పష్టంగా తెలియజేయాలని ఆయన కోరారు.
కళాశాలలు, పాఠశాలల్లో ప్రభుత్వ నిబంధనలు విధిగా పాటించాలని నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు.