అమరావతి. ఆక్సిజన్ కొరత అధిగమించేందుకు వ్యూహాత్మక అడుగులు: పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
ఆసుపత్రులకు ఆక్సిజన్ అందించేందుకు ఏపీ పటిష్ట కార్యాచరణ
ప్రాణవాయువు సరఫరాపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ
కరోనా రోగుల ప్రాణాలను కాపాడేందుకు చర్యలు
ఆక్సిజన్ కొరతతో పొరుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న మరణాలు
దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఆక్సిజన్ ఉత్పత్తి కన్నా డిమాండ్ ఎక్కువ
ప్రత్యామ్నాయ మార్గాలు చూపే దిశగా గురువారం మంత్రి మేకపాటి అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష
కరోనా సెకండ్ వేవ్ వింభిస్తున్న వేళ.. ఆక్సిజన్ అవసరం పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది.
పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అధ్యక్షతన వైద్య, హోం, కుటుంబ సంక్షేమ శాఖల సమన్వయంతో గురువారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు.
మనసున్న దార్శనిక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రజల ప్రాణాలను కాపాడుకోవడమే ప్రాధాన్యతగా రాష్ట్రంలోని ఆక్సిజన్ ఆధారిత పరిశ్రమలకు ప్రత్యామ్నాయం చూపే దిశగా పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
అవసరమైతే గ్రామీణ ఆక్సిజన్ ఆధారిత పరిశ్రమల ద్వారా ఉపాధి పొందుతున్న వారిని ఆదుకోవడానికి గల అవకాశాలపై మంత్రి మేకపాటి సమీక్ష నిర్వహించనున్నారు.
తప్పనిసరి పరిస్థితులలో అవసరమయితే పరిశ్రమలకు ఇతర ప్రాంతాల నుంచి ఆక్సిజన్ దిగుమతి చేసుకునే వెసులుబాటు కల్పించే అవకాశాలపై పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గురువారం ఉన్నతస్థాయి సమీక్షకు రంగం సిద్ధం చేశారు.
వీడియో కాన్పరెన్స్ ద్వారా వైద్య,పరిశ్రమలు, హోమ్, కుటుంబ సంక్షేమ శాఖల ఉన్నతాధికారులతో ఉదయం 11గం.లకు మంత్రి మేకపాటి సమీక్ష నిర్వహించనున్నారు.
ప్రాణవాయువు కొరతతో దేశవ్యాప్తంగా ఏపీ పొరుగు రాష్ట్రాలలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో ఈ నెల 18న కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
రేపటి (22వతేదీ) నుంచి ఫార్మ, పెట్రోలియమ్ రిఫైనరీలు, ఉక్కు కర్మాగారాలు, ఆక్సిజన్ సిలిండర్ల తయారీ, న్యూక్లియర్ ఎనర్జీ ఫెసిలిటీస్, ఆహార, నీటి శుద్ధి, వ్యర్థపు నీటిని మంచినీరుగా మార్చే ప్లాంట్లు, ఇంజక్షన్, సీసాల వంటి ముఖ్య తయారీ పరిశ్రమలకు మినహాయించి మిగతా పరిశ్రమలకు ఆక్సిజన్ సరఫరా నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలను ఇచ్చింది.
ఈ నేపథ్యంలో ఆయా పరిశ్రమలకు ప్రత్యామ్నాయ మార్గాలు సహా కీలక విషయాలపై సమగ్రంగా చర్చించనున్నారు మంత్రి గౌతమ్ రెడ్డి.
కరోనా కేసులు రోజురోజుకు పెరగడం, మరణాల సంఖ్య కూడా పెరుగుతున్న నేపథ్యంలో మెడికల్ ఆక్సిజన్ కు డిమాండును పరిగణలోకి తీసుకుని ఆసుపత్రులకు సరఫరా చేయడమే ప్రథమ ప్రాధాన్యతగా భావించి ప్రజల ప్రాణాలను రక్షించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలను చేయడానికి సమాయత్తమవుతోంది.
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన తొమ్మిది రకాల పరిశ్రమలు కాకుండా ఏవైనా ఇతర ఆక్సిజన్ ఆధారిత పరిశ్రమలు ఉన్నట్లయితే వాటికి స్వతహాగా ఆక్సిజన్ (ఎయిర్ సెపరేటర్ యూనిట్ల(ఏఎస్ యూ)) నెలకొల్పుకునేందుకు, లేదా ఆక్సిజన్ ను దిగుమతి చేసుకునే అవకాశం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను ఇవ్వనుంది.
రాష్ట్ర వ్యాప్తంగా ఆక్సిజన్ వినియోగంతో నడిచే పరిశ్రమలపై జిల్లా పరిశ్రమల శాఖ అధికారుల ఆధ్వర్యంలో పర్యవేక్షణకు సంబంధించిన పటిష్టమైన చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది.
రేపటి ఈ సమావేశంలో వైద్య, కుటుంబ సంక్షేమ, శాంతి భద్రతలు, పరిశ్రమల శాఖలు భాగస్వామ్యమవనున్నాయి.