ఉద్యోగ నియామక క్యాలెండర్ను ఉగాదినాటికి విడుదల చేయండి – ముఖ్యమంత్రి జగన్
ప్రశ్నాపత్రాల రూపకల్పనతో పాటు మూల్యాకనం కూడా వాళ్ళే చేయాలి
ఆంధ్రప్రదేశ్లో స్వయంప్రతిపత్తితో కొనసాగే కళాశాలల్లో ప్రశ్నాపత్రాల రూపకల్పన, మూల్యాంకన విధానాన్ని రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
స్వయంప్రతిపత్తి గల కళాశాలల్లో పరీక్షా విధానం, జగనన్న విద్యాదీవెనపై గుంటూరు జిల్లా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అన్ని ఇంజనీరింగ్ కళాశాలలకు అనంతపురం, కాకినాడలోని జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం రూపొందించిన ప్రశ్నాపత్రాలే ఇవ్వాలని, మూల్యాంకనం సైతం విశ్వవిద్యాలయాలే నిర్వహించాలన్నారు.
డిగ్రీ కళాశాలలకు ఆయా విశ్వవిద్యాలయాలే ప్రశ్నాపత్రాల రూపకల్పన, మూల్యాంకనం చేస్తాయన్నారు.
డిగ్రీలు సాధించిన తర్వాత ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉండాలని, విద్యార్ధుల్లో నైపుణ్యం లేకపోతే మౌఖిక పరీక్షలను ఎదుర్కోలేరని, ప్రతి ఒక్కరూ నైపుణ్యం, విషయ పరిఙానంతో విద్యా సంస్థ నుంచి బయటకు రావాలన్నారు.
అలాగే ఈ ఏడాది భర్తీ చేయనున్న ఉద్యోగ ఖాళీలకు సంబంధించి, క్యాలెండర్ను సిద్ధం చేసి ఉగాది రోజున విడుదల చేసేలా చూడాలన్నారు.
ఈ సంవత్సరం 6000 పోలీసు నియామకాలు చేపట్టాలని, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపులైటీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.