ఐజేయూ, టీయూడబ్ల్యూజే మద్దతుతో గర్జించిన ఆంధ్రభూమి ఉద్యోగులు
తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోరుతూ సోమవారం నాడు ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ), తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే)మద్దతుతో ఆంధ్రభూమి ఉద్యోగుల అసోసియేషన్ నిర్వహించిన ఛలో హైదరాబాద్ కార్యక్రమం విజయవంతంగా జరిగింది.
ఉద్యోగుల నినాదాలతో సరోజిని దేవి రోడ్డు దద్దరిల్లిపోయింది.
దక్కన్ క్రానికల్ కార్యాలయం ముందు చేపట్టిన ధర్నా ఆ పత్రిక యాజమాన్యాన్ని హడలెత్తించింది. ఆందోళనను భగ్నం చేసేందుకు పోలీసు బలగాలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
ప్రదర్శనకు ముందు క్లాక్ టవర్ వద్ద అమరుల స్థూపానికి నివాళ్ళర్పించారు.
ఆంధ్రభూమి ఉద్యోగుల సమస్య రెండు తెలుగు రాష్ట్రాలకు ముడిపడి ఉన్నందున ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(ఏపీయూడబ్ల్యూజే), తెలంగాణా స్టేట్ ఫోటో జర్నలిస్ట్స్ అసోసియేషన్, హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (హెచ్.యు.జె) సంఘాలు మద్దతు తెలిపాయి.
ఐజేయూ నాయకులు కె.శ్రీనివాస్ రెడ్డి, అమర్ నాథ్, అంబటి ఆంజనేయులు, ఆలపాటి సురేష్, సోమసుందర్, టీయూడబ్ల్యూజే అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నగునూరి శేఖర్, కె. విరాహత్ అలీ, ఉప ప్రధాన కార్యదర్శి విష్ణుదాస్ శ్రీకాంత్, నాయకులు ఏ.రాజేష్, కె.రాములు, హెచ్.యు.జె కార్యదర్శి శిగ శంకర్ గౌడ్, టి.ఎస్.పి.జె.ఏ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గంగాధర్, హరి, ఆంధ్రభూమి ఎంప్లాయిస్ అసోసియేషన్ కన్వీనర్ వెల్జాల చంద్రశేఖర్, నాయకులు వి.విజయ్ ప్రసాద్, జె.ఎస్.ఎం.మూర్తి, స్వామినాథ్, నగేష్, వసుంధర, ఆదిలక్ష్మీ, రిటైర్డ్ ఎంప్లాయిస్ నాయకులు బాలకృష్ణ, నర్సింగ్ రావు శైలేంద్ర తదితరులు పాల్గొన్నారు.
దిగి వచ్చిన యాజమాన్యం న్యాయం చేస్తామని భరోసా
ఆంధ్రభూమి ఉద్యోగుల పోరాటంపై యాజమాన్యం దిగివచ్చింది. యాజమాన్య ప్రతినిధి, డిప్యూటీ సిఇఓ పి.ఎస్.వి.కృష్ణయ్య యూనియన్ ప్రతినిధి బృందంతో చర్చలు జరిపారు.
ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు చట్టపరంగా దక్కాల్సిన అన్నీ ప్రయోజనాలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ఈ వ్యవహారం ఎన్.సి.ఎల్.టిలో ఉన్నందున తుది తీర్పు వచ్చాక తమ కార్యకలాపాలను యధావిధిగా కొనసాగిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
త్వరలో ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన భరోసానిచ్చారు.