అమ్మ…ఓల్డేజ్ హోమ్
ఈ మధ్య ఒకానొక ఖరీదైన వృద్ధాశ్రమానికి వెళ్ళాను. ఖరీదైనదని ఎందుకన్నానంటే అక్కడున్న వాళ్ళు దాదాపు ఎన్నారైల తల్లితండ్రులు. నెలవారీ చెల్లింపులు డాలర్లలోనే ఉంటాయి.
వృద్ధాశ్రమంలో తమ తల్లి తండ్రులు సుఖంగా బతకాలని పిల్లలు భారీగానే డబ్బు చెల్లిస్తుంటారు. ఇక్కడున్న చాలా మందికి పెద్దపెద్ద ఇళ్ళు,కొందరికి పొలాలు,ఆస్తులూ ఉన్నాయి.
ఎవ్వరూ చూసేవాళ్ళు లేక,పెద్ద పెద్ద ఇళ్ళల్లో బిక్కుబిక్కుమంటూ ఉండలేక వృద్ధాశ్రమాల్లో చేరుతున్నారు. విదేశాల్లో ఉంటున్న పిల్లలు చేర్పిస్తున్నారు.
నేను వెళ్ళేటప్పటికి రఘురాం అనే ఒక ఎన్నారై అక్కడున్నాడు. ఆయన తల్లి ఆశ్రమంలో ఉన్నారు. ఆరు నెలలకోసారి వస్తాడట ఆయన.
ఆయనతో మాట్లాడాలనిపించింది. ఆశ్రమం బయట ఉన్న గుట్టల వేపు నడుస్తూ వెళ్ళాం.”మీ అమ్మ గారికి ఇప్పుడెలా ఉంది” అడిగాను.”బాగానే ఉంది, వయసు మీదపడింది, ఓల్డేజ్ రిలేటెడ్ ప్రోబ్లంస్ అంతే.” అన్నాడు.
“ఆమెకి హటాత్తుగా ఏమైనా అయితే ఎలా?” అని అడిగాను. “హోం వాళ్ళు చూసుకుంటారు. నాకు ఇంఫార్మ్ చేస్తారు. జూబ్లీ హిల్స్ లో పెద్ద ఇల్లుంది ప్రోపర్టీస్ ఉన్నాయ్. హటాత్తుగా డాడి చనిపోతే తప్పనిసరి పరిస్థితుల్లో ఇక్కడుంచాం.” అన్నాడు ఆయన.
“అమెరికా తీసుకెళ్ళొచ్చుగా.” “ప్రయాణం చేయలేనంది” “ఇక్కడ ఇల్లుంది, ఆస్తులున్నాయ్ కదా ఇంక అమెరికాలోనే ఎందుకుండడం.?” రఘురాం చివ్వున తలెత్తి నా వేపు చూసాడు. “ఇక్కడుండలేమండీ” “ఎందుకుండలేరు?” “నా వైఫ్,పిల్లలు రారు. అమెరికా జీవితానికి అలవాటు పడితే వదలడం కష్టం.”
“ఏముందక్కడ?” “ఏమి లేదో చెప్పండి.” “మీకు జన్మనిచ్చిన అమ్మ అక్కడ లేదుగా””వస్తూ పోతూ ఉంటాగా” “సారీ, నేనిలా మాట్లాడుతున్నానని వేరే అనుకోకండి, నేను ఈ అంశం మీద పరిశోధన చేస్తున్నా. ఎన్నో ఓల్డేజ్ హోంలు తిరుగుతూ ఉంటాను.
ఎంతో మంది తల్లితండ్రులతో మాట్లాడుతుంటాను. వాళ్ళ అనుభవాలు, పిల్లల మీద వాళ్ళ ప్రేమలు కళ్ళల్లో నీళ్ళు తెప్పిస్తుంటాయి. లోపల ఎంత బాధ ఉన్నా పిల్లలు విదేశాల్లో ఉండడాన్ని వాళ్ళు సమర్ధిస్తుంటారు.”
“మా అమ్మ కూడా అంతేనండి” “అమ్మలందరూ అంతే రఘురాం గారూ. ఇక్కడ కూర్చుందామా. మా అమ్మ గురించి మీకు చెప్పాలనిపిస్తోంది” అన్నాను.”తప్పకుండా,అమ్మ కూడా నిద్రపోతోంది” అన్నాడు రఘురాం.
అక్కడున్న ఓ బెంచీ మీద కూర్చున్నాం. మా అమ్మ నాన్నలకి నేనొక్కడినే. పిజి చేసి వచ్చేస్తానని వెళ్ళి అక్కడే అమెరికాలో ఉండిపోయాను. పిజి అయిపోయింది, మంచి ఉద్యోగమొచ్చింది. పెళ్ళి చేసారు, పిల్లలు పుట్టుకొచ్చారు.
విలాసవంతమైన జీవితం, వీకెండ్ పార్టీలు, ప్రయాణాలు. అప్పుడప్పుడూ ఇండియా రావడం, చుట్టాల్లా ఉండి వెళ్ళడం. నాన్న మంచి ఉద్యోగంలో ఉండడంతో ఇంట్లో పనిచేసేవాళ్ళకి లోటులేదు.
ఓ రాత్రి నాన్న హటాత్తుగా గుండె పోటుతో చనిపోయాడు. శవంతో అమ్మ ఆ రాత్రంతా ఉంది. షాక్ లోకి వెళ్ళిపోయింది. నాన్న చనిపోయాడని ఆమె మనసు రికార్డ్ చేసుకోలేదు.
మూడు రోజుల తర్వాత నేనొస్తే వచ్చావా, నాన్నని ఆసుపత్రిలో జాయిన్ చేసి నాకు చూపించడం లేదు” అంది. నాకు ఏడుపు తన్నుకొస్తోంది. అమ్మ ఏడవడం లేదు. హాస్పిటల్కి పోదామంటుంది.
అమ్మ చుట్టూ బంధువులున్నారు. అరగంట తర్వాత మార్చురీ నుండి నాన్న శవాన్ని తెచ్చారు. ఆయనకి ఆఖరి స్నానం చేయిస్తున్నప్పుడు అమ్మ విరుచుకుపడిపోయింది, నాన్న లేడని అర్ధమైంది, అంతా ముగిసిపోయింది.
అమ్మని అమెరికా పోదాం రమ్మన్నాను. రానంది. ఈ ఇంటితో, మీ నాన్నతో ఏభై ఏళ్ళ అనుబంధం నాది. ఇక్కడే ఉంటాను ఎక్కడికీ రానంది. నా పరిస్థితి మీరూహించగలరనుకుంటాను.
అమ్మకి నేనొక్కడినే ఆమె ఆరోగ్యం అంతంత మాత్రమే, ఎన్నో రకాల మందులేసుకుంటుంది. నాన్న ఇన్నాళ్ళు అమ్మని చూసుకున్నాడు. రేపటి నుండి ఎలా? ఒంటరిగా ఉన్న ఓ దగ్గర బంధువును అమ్మ దగ్గరుంచి నేను వెళ్ళిపోయాను.
వెళ్ళాను కానీ పదిహేను రోజుల్లోనే తిరిగొచ్చాను. మళ్ళీ వెళ్ళాను. మళ్ళీ వచ్చాను. నా తిరుగుళ్ళు ఇంట్లో గొడవలు రేపాయి. నా ప్రయాణ ఖర్చులు విపరీతంగా పెరిపోయాయి.
అంత పెద్ద ఇంటిలో ఒక్కర్తీ ఉంటున్న అమ్మ గుర్తుకొస్తే ముద్ద దిగేది కాదు. తన తోడుని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న అమ్మ గుర్తొచ్చి ఏడ్చేవాడిని.
నా జీవితమంతా అమ్మ పంచిన ప్రేమ, లాలన మర్చిపోయి యంత్రంలా మారిన నా బతుకు పట్ల నాకే అసహ్యం వేసేది.
ఓ రొజు నా పిల్లలిద్దరినీ కూర్చోబెట్టి నా పరిస్థితి గురించి చెప్పాను. “నానీ తో స్కైప్ లో మాట్లాడొచ్చుగా డాడీ” అని మాత్రమే అన్నారు.
“నేను ఇండియా వెళ్ళిపోవాలనుకుంటున్నాను.” “వాట్…ఆ ముసలామె కోసం నీ కెరీర్ పాడుచేసుకుంటావా?”అంది నా భార్య. “డాడీ, ఆ డర్టీ ఇండియాకి మేము రాం. “ఇద్దరూ ఒకే సారి అరిచారు.
రోకీ నేను చచ్చిపోతే మీ అమ్మని కూడా నేను వదిలేసినట్టు వదిలేస్తావా? ముగ్గురూ బిత్తరపోయారు. నేను మిమ్మళ్ని రమ్మని అడగడం లేదు. మీ చదువులు పాడవుతాయని నాకూ తెలుసు, మీరు ఇక్కడే ఉండండి నేను వెళతాను.
దాని మీద చాలా అర్గుమెంట్స్ జరిగాయి. “ఇంత మంచి జీవితాన్నిచ్చిన అమెరికాని వదిలేసి ఇండియా పోతానంటున్నావ్ ఏముంది డాడీ అక్కడ” అంది నా కూతురు “అక్కడ మా అమ్ముంది. నా మీద ప్రాణాలన్ని పెట్టుకుని పెంచిన మా అమ్ముందమ్మా అక్కడ. నన్ను కని పెంచిన నా కన్నతల్లిని వొంటరిగా వదిలేయలేనమ్మా” అంటూ ఏడ్చాను, గుండెలవిసేలా ఏడ్చాను.
ఆ తర్వాత నెల రోజుల్లో అన్నీ సర్దేసుకుని, ఉద్యోగానికి రెజైన్ చేసీ ఇండియా వచ్చేసాను. నేనొచ్చి ఐదేళ్ళయ్యింది. మా నాన్న మీద బెంగతో, అనారోగ్యంతో అమ్మ వెళ్ళిపోయింది.
అమ్మతో గడిపిన ఈ ఐదేళ్ళు నాకు ఎంతో తృప్తిని, సంతోషాన్ని ఇచ్చాయి. ఆ తర్వాత నా భార్యా పిల్లలూ కూడా వచ్చేసారు.
చాలా కాలంగా ఇలా ఓల్డేజ్ హోంలు తిరుగుతూ నా కధ చెబుతుంటాను. అమెరికా కంటే అమ్మెంత గొప్పదో చెబుతుంటాను.
“రఘురాం కళ్ళల్లో నీళ్ళు. నన్ను వదిలేసి వడి వడిగా వాళ్ళమ్మ గది వైపు వెళ్ళిపోయాడు.” తల్లిదండ్రులు జీవించి ఉండగానే మనసారా సేవించి మనబాల్యంలో వారు పంచిన ఆప్యాయతానురాగాలను తిరిగి పంచి కన్నవారి ఋణం తీర్చుకోండి.
కాలం కరిగిపోయిన తరువాత ఎంత ఏడ్చినా ఏమి పలితం?”
అశ్రునయనాలతో
ఒక శ్రావణకుమారుడు