ప్రముఖ అంబేడ్కర్ వాది ప్రజ్ఞానంద్ ఇకలేరు
సంతాపం తెలిపిన పలువురు నాయకులు
ప్రముఖ అంబేడ్కర్ వాది దళిత రత్న అవార్డు గ్రహిత, బౌద్ధ అధ్యయన కేంద్ర వ్యవస్థాపకులు, బౌద్ధ ధర్మ ప్రచారకులు వరంగల్ మహానగరం గొర్రెకుంటకు చెందిన నమిండ్ల ఫ్రాన్సిస్ (ప్రజ్ఞానంద్) ఆదివారం అకాల మరణం చెందారు. గత 10 రోజులుగా కరోనాతో బాధపడి ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు.
అతి నిరుపేద కుటుంబంలో నమిండ్ల ఉప్పలమ్మ, మల్లయ్య దంపతులకు జన్మించిన ప్రజ్ఞానంద్ తన బాల్యం నుండి తల్లిదండ్రులతో కూలీ పనులకు వెళ్లి కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండి ఎంతో బాధ్యతగా మెలిగారు.
రాత్రి వేళల్లో రిక్షా తొక్కి పగలు పాఠశాల విద్యనభ్యసించి ధర్మారం ఉన్నత పాఠశాలలో హై స్కూల్ విద్యను పూర్తి చేశారు.
గొర్రెకుంట, ధర్మారం పారిశ్రామిక ప్రాంతంలో హమాలీగా పనిచేస్తూనే హమాలీ కార్మికుల హక్కులకై పనిచేసారు. కార్మిక సమస్యలపై పీపుల్స్ వార్ తో పనిచేసి పోలీసులతో భౌతిక హింసకు గురై జైలు జీవితం గడిపాడు.
కొంతకాలం స్పెషల్ టీచర్ గా పనిచేసి, తర్వాత ఆర్ టి సి లో కండక్టర్ గా పనిచేసి తన కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చారు.
ఇదే క్రమంలో అంబేద్కర్ సిద్ధాంతానికి ఆకర్షితుడై అంబేడ్కర్ యువజన సంఘంలో చేరి వరంగల్ జిల్లా అధ్యక్షునిగా, రాష్ట్ర కమిటీ నాయకునిగా పనిచేసి అంబేడ్కర్ సంఘాన్ని గ్రామ గ్రామాన విస్తరింపచేయడమే కాకుండా ఎన్నో సామాజిక కార్యక్రమంలో పాల్గొంటూ గొర్రెకుంటలో బౌద్ద అధ్యయన కేంద్రం ఏర్పాటు చేసి ఉన్నత చదువులు చదువుకునే విద్యార్థులకు పుస్తకాలు అందించి తన దాతృత్వాన్ని చాటుకున్నాడు.
విద్యార్థులకు పాఠాలతో పాటు మానవ విలువలు, బౌద్ధ ధర్మ సారం గురుంచి బోధిస్తూనే పేద విద్యార్థులకు సహాయ సహకారాలు అందించారు.
తోటి సిబ్బందితో కూడా ఎంతో కలివిడిగా, ఆత్మీయతో ఉండేవారు. తెలంగాణ ఉద్యమంతో పాటు ఈ ప్రాంతంలో జరిగిన సామాజిక ఉద్యమాల్లో చురుకుగా పాల్గొని మేధావులు, ఉద్యమకారులతో విశాలమైన ప్రజా సంబంధాలు కలిగిన నాయకుడు ప్రజ్ఞానంద్ అకాల మరణం ఎంతోమందిని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తను బుద్ధిజం స్వీకరించడమే కాకుండా తన పిల్లలకు కూడా వెన్నెల, సంఘమిత్ర అని నామకరణం చేశారు.
ప్రజ్ఞానంద్ మరణం వరంగల్ ఉమ్మడి జిల్లాలో బహుజన ఉద్యమాలకు తీరని లోటు. మృదు స్వభావి, స్నేహశీలి అయిన ప్రజ్ఞానంద్ తన కన్నా చిన్నవాళ్లనైన అన్న అని ఎంతో ఆప్యాయతతో సంబోధించేవారు.
వందల సమావేశాల్లో పాల్గొని వేల మందిని చైతన్యం చేసి లక్షల మందితో మమేమకమైన ప్రజ్ఞానంద్ లేరన్న నిజాన్ని ఎవరు భరించలేని బాధాకరమైన స్థితిలో ప్రజ్ఞానంద్ అంతిమ యాత్రకు పలువురు నాయకులు హాజరై వారికి జోహార్లు అర్పించి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
అంతిమ సంస్కారానికి హాజరైన వారిలో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ వరంగల్ పార్లమెంటు కన్వీనర్ సాయిని నరేందర్, పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ సోమ రామమూర్తి, అసంఘటిత కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు నలిగింటి చంద్రమౌళి, ద్రవిడ బహుజన సమితి వ్యవస్థాప అధ్యక్షులు డాక్టర్ జిలికర శ్రీనివాస్, డి.బి.ఎస్ సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షులు మచ్చ దేవేందర్, ఈర్ల సాగర్, న్యాయవాది, బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకులు గంధం శివ, రజక రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు చాపర్తి కుమార్, ఉద్యోగ సంఘం రాష్ట్ర నాయకులు బొడ్డు ప్రసాద్, బహుజనం పాట బొడ్డు కుమారస్వామి, బుల్లెట్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.