చిత్తూరు జిల్లా : అగ్రవర్ణాల ఆక్రమణకు భూమిని కొల్పోయిన దళిత మహిళకు న్యాయం చేయాలని కోరుతూ చిత్తూరు నగరం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో అక్రమంగా భూమిని ఆక్రమించుకున్న అగ్రవర్ణాలపై చర్య తీసుకొని దళిత మహిళకు న్యాయం చేయాలని జిల్లా రెవెన్యూ అధికారికి వినతి పత్రాన్ని సిఐటియు జిల్లా అధ్యక్షుడు వాడ గంగరాజు అందించారు.
జిల్లాలోని కలికిరి మండలం చదివేవాండ్లపల్లిలో దళిత మహిళ ఆదెమ్మ భూమిని అక్రమంగా అగ్ర కులస్తులు ఆక్రమించుకోవడం దారుణమని వెంటనే వారి భూమిని వారికి అప్పగించి ఆమెకు న్యాయం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు వాడ గంగరాజు డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా సోమవారం జిల్లా రెవెన్యూ అధికారికి వినతిపత్రం ఇస్తూ ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం గత 25 సంవత్సరాల క్రితం షెడ్యూల్ కులాల సహకార సంఘం తరఫున భూమిలేని వారికి భూమి కొనుగోలు చేసి ఇచ్చిందన్నారు.
ఆ క్రమంలో కలికిరిచదివేవాండ్లపల్లిలో ఆదెమ్మ అనే మహిళకు భూమి ఇవ్వడం జరిగిందన్నారు.
అలాంటి భూమిని కొనడం గాని అమ్మడం గాని చేయకూడదని నిబంధనలున్నాయనీ, అయితే ఆ భూమిని కొంతమంది అగ్ర కులస్తులు మేము కొన్నామని దౌర్జన్యంగా ఆక్రమించుకోవటం జరిగిందన్నారు.
ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని స్థానిక తాసిల్దార్ లకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు న్యాయం జరగలేదన్నారు.
సదరు భూమికి సంబంధించిన సర్వే నంబర్లపై అగ్రకులాల వారికి పాసు పుస్తకాలు ఇవ్వడం దారుణమని ఈ సందర్భంగా ఆయన అన్నారు.
వాటిని వెంటనే రద్దు చేసి ఆదెమ్మకు న్యాయం చేయాలని ఆయన కోరారు.
జిల్లా రెవెన్యూ అధికారిగా వారిపై చర్యలు తీసుకొని ఆమెకు న్యాయం చేయాలని కోరుతూ, లేనిపక్షంలో ఆందోళన చేపడతామని తెలిపారు.