ఆర్యవైశ్యుల సంఘటనా శక్తే వాసవి పరివార్ ఇంటర్నేషనల్ – రాష్ట్ర గౌరవ అధ్యక్షులు సుంకు చంద్రశేఖర గుప్తా.
ఆర్యవైశ్యులను, ఆర్యవైశ్య సంఘాలను ఒక త్రాటిపై నిలిపి, ఆర్థిక, సామాజిక అసమానతలు తొలగింపుచేయాలనే బలీయమైన కాంక్షతో, పేదవారైన ఆర్యవైశ్యులను గుర్తించి వారికి అన్నివిధాలా సహాయ సహకారాలు అందిస్తూ స్థితిమంతులుగ తీర్చిదిద్దాలని, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కొరకు ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములవారి స్మృతి వనాలు ప్రభుత్వం ఏర్పరచే విధముగా కృషిచేయడం, ఆర్యవైశ్యులకు వారి ఇలవేలుపు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి చూపిన మార్గాలు అహింస, శాంతి, సహనం, సాటివారి ఎడ ఆత్మీయతా భావం లను తెలిపి అమ్మవారి త్యాగం లోకకళ్యాణార్ధం అనే విషయం తెలిపి ఉన్నతులుగ తీర్చిదిద్దాలనే భావనతో ఆర్యవైశ్యుల సంఘటనా శక్తి – వాసవిపరివార్ ఇంటర్నేషనల్ సంఘాన్ని గుంటూరు జిల్లా అమరావతి, తాళ్ళాయపాలెం శివక్షేత్ర పీఠాధిపతులు శ్రీ శివస్వామి వారు జనవరి 31వ తేదీన ప్రారంభించారని రాష్ట్ర వాసవిపరివార్ ఇంటర్నేషనల్ గౌరవ అధ్యక్షులు సుంకు చంద్రశేఖర గుప్తా తెలిపారు.
నేడు ఒంగోలు నగరానికి వచ్చిన సందర్భముగా వారు స్థానిక ప్రకాశంజిల్లా పరివార్ గౌరవ అధ్యక్షులు రాధా రమణ గుప్తా జంధ్యం, నేరెళ్ల శ్రీనివాసరావులతో కలసి వాసవిపరివార్ లక్ష్యాలను, విధివిధానాలను కలిగిన కరపత్రములను ఆవిష్కరించారు.
అనంతరం వారు మాట్లాడుచూ… హిందూ ధర్మ దీక్షా కంకణదారులు, సంస్కృతి సంప్రదాయముల పరిరక్షణకు అహర్నిశలు పాటుపడుచున్న శ్రీ శివస్వామి గారి ఆశీస్సులతో, రాష్ట్ర వాసవి పరివార్ అధ్యక్షులు నాదెళ్ల శ్రీనివాసరావు నేతృత్వంలో సంఘాన్ని బలోపేతం చేసే కార్యక్రమమును చేపట్టామని, ప్రతి జిల్లా, మండలం, గ్రామగ్రామాన సంఘ కమిటీలు ఏర్పరచామని, ఆర్యవైశ్యులను రాజకీయ, ఆర్థిక, సామాజిక పరంగా వృద్ధి చెందే విధముగ తోడ్పాటు అందిచాలనే మా లక్ష్య సాధనకు కృషి చేస్తున్నామని తెలిపారు.
ఉన్నతమైన లక్ష్యం కలిగిన వాసవి పరివార్ లో ప్రతి ఒక్క ఆర్యవైశ్యులు, ఆర్యవైశ్య మహిళలు మరియు ఆర్యవైశ్య యువత చేరాలని పిలుపునిచ్చారు. ఆర్యవైశ్య జాతి అభివృద్ధికి బాటలు ఏర్పరచాలని విజ్ఞప్తి చేశారు.