రూ.2,937 కోట్లతో టీటీడీ వార్షిక బడ్జెట్‌కు ఆమోదం
టీటీడీ ఉద్యోగులకు కోవిడ్ వ్యాక్సిన్
ఉగాది నుంచి శ్రీవారి ఆర్జిత సేవలకు భక్తులకు అనుమతి
వేద పాఠశాలల పేర్లు ఎస్వీ వేదవిజ్ఞానపీఠంగా మార్చాలని నిర్ణయం
బర్డ్ ఆస్పత్రిలో చిన్నపిల్లల విభాగానికి రూ.9 కోట్లు కేటాయింపు
పర్యావరణ పరిరక్షణకు గ్రీన్‌పవర్ వినియోగించాలని నిర్ణయం
పాలకమండలి నిర్ణయాలు వెల్లడించిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం 2021–22 వార్షిక బడ్జెట్‌ను రూ.2,397.82 కోట్లతో ఆమోదించినట్లు టీటీడీ పాలకమండలి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
పాలకమండలి సమావేశం అనంతరం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా పాలకమండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు.
టీటీడీ ఉద్యోగులకు కరోనా వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. దీనిపై ఇవాళ లేదా రేపు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని, ఎంపిక చేసిన ప్రైవేట్ ఆస్పత్రుల్లో మార్చి 1 నుంచి వ్యాక్సినేషన్ చేయనున్నట్లు తెలిపారు.
కోవిడ్ నిబంధనలు పాటిస్తూ రథ సప్తమి రోజు లక్ష మంది భక్తులకు వాహన సేవలు వీక్షించే భాగ్యం కల్పించామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
ఏప్రిల్ 14న ఉగాది నాటి నుంచి భక్తులను శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్జిత సేవలకు అనుమతిస్తున్నట్లు తెలిపారు.
సేవకు వచ్చే మూడు రోజుల ముందు కోవిడ్ పరీక్షలు చేయించుకొని సర్టిఫికెట్ సమర్పించాలన్నారు.
దేశవ్యాప్తంగా ఉన్న టీటీడీ కల్యాణ మండపాల్లో వివాహాలు, దైవ కార్యాలకే వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు.
టీటీడీ పరిధిలోని ఆరు వేదపాఠశాలల పేర్లను ఎస్వీ వేదవిజ్ఞానపీఠంగా పేర్లు మార్చాలని నిర్ణయించామన్నారు.
తిరుపతిలోని బర్డ్‌లో చిన్న పిల్లల ఆసుపత్రి ఏర్పాటు చేయడానికి రూ.9 కోట్లు కేటాయించినట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
టీటీడీ ప్రసాదాలు, అన్న ప్రసాదాల తయారీకి ఉపయోగించే నెయ్యి ట్యాంకుల సామర్థ్యాన్ని ప్రస్తుతం ఉన్న 82.4 మెట్రిక్ టన్నుల నుంచి 180.4 మెట్రిక్ టన్నుల సామర్ధ్యానికి పెంచేందుకు ఆమోదించినట్లు తెలిపారు.
తిరుమల శ్రీవారి ఆలయం తరహాలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో తులాభారం ప్రవేశ పెట్టేందుకు టీటీడీ పాలకమండలి ఆమోదించినట్లు తెలిపారు.
టీటీడీ పరిధిలోకి ఇతర ఆలయాలను తీసుకోవడానికి విధి విధానాలను నిర్ణయించడం జరిగిందని, ఇలాంటి ఆలయాలకు శ్రీవాణీ ట్రస్ట్ నుండి ఆర్థిక సహాయం చేయడం జరుగుతుందన్నారు.
తిరుమలలోని అన్ని వసతి, విశ్రాంతి గృహాలు, సత్రాల వద్ద విద్యుత్ వినియోగానికి సంబంధించి జవాబుదారీ తనం పెంచేందుకు ఏపీ ఎస్పీడీసీఎల్ ద్వారా విద్యుత్ మీటర్ల ఏర్పాటుకు ఆమోదించినట్టు తెలిపారు.
తిరుమలలో క్రమంగా 50 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి నిర్ణయించారు.
అదేవిధంగా కొత్త ఓపిడి భవనంలో మూడవ అంతస్తు విస్తరణ పనులకు రూ.3.75 కోట్లతో టెండర్లకు ఆమోదం తెలిపారు.
త్వరలో ముంబై, జమ్మూలో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించడానికి నిర్ణయించారు.
శ్రీవారి మెట్టు మార్గంలో నడచి వచ్చే భక్తులకు అన్న ప్రసాదం అందించాలని పాలక మండలి సమావేశంలో నిర్ణయించారు.
అయోధ్యలో రామమందిర నిర్మాణ ట్రస్ట్ టీటీడీకి భూమి కేటాయిస్తే శ్రీవారి ఆలయం లేదా భజన మందిరం లేదా యాత్రికుల వసతి సముదాయంలో వారు ఏది కోరితే అది నిర్మించాలని నిర్ణయించినట్లు చెప్పారు.
గుడికో గోమాత కార్యక్రమానికి దేశ వ్యాప్తంగా వస్తున్న స్పందన వల్ల గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని తీర్మానించినట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఈ సందర్భంగా తెలియజేశారు.