స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేశాం
- డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్
తెలుగు వారి ఆత్మగౌరవంతో ముడిపడి ఉన్న విశాఖ స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరించండాన్ని వ్యతిరేకిస్తూ ముందుగా ప్రకటించినట్లే అసెంబ్లీలో తీర్మానం చేశామని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు.
గురువారం సాయంత్రం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ ఆంధ్రుల హక్కు అయిన విశాఖ ఉక్కును నిలబెట్టేందుకు ఐదు మార్గాలను కేంద్రానికి సూచిస్తూ తీర్మానం చేశామని అన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఉత్తరాంధ్ర ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు.
రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ప్రవేశపెట్టిన బడ్జెట్ 2021-22 అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను తెలియజేస్తున్నదని చెప్పారు.
మేనిఫెస్టో అంటే ఎన్నికల వరకే పరిమితమైన అంశం అని భావించే వారికి తమ ప్రభుత్వం ఇప్పటికే 95 శాతం హామీలను నెరవేర్చి చూపించిందని అన్నారు.
కరోనా కట్టడి కోసం దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ముమ్మర సహాయక చర్యలు చేస్తున్న ప్రభుత్వాన్ని అభినందించక పోయినా పర్వాలేదు కానీ దిగజారుడు రాజకీయాలు మాత్రం చేయవద్దని టీడీపీని ఉద్దేశించి పేర్కొన్నారు.
రాజకీయాలు తప్ప ప్రజా సంక్షేమం పట్టని ఆ పార్టీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడం ప్రజా శ్రేయస్సు పట్ల వారికున్న చిత్తశుద్ధిని నిరూపిస్తోందని దుయ్యబట్టారు.
వ్యవసాయ బడ్జెట్ ను శాసనమండలిలో ప్రవేశపెట్టే గొప్ప అవకాశాన్ని తనకు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఈ సందర్భంగా కృష్ణ దాస్ కృతజ్ఞతలు తెలిపారు.