ప్రింటింగ్‌ను నిలిపేస్తున్న ప్రముఖ దిన పత్రిక? డిజిటల్ ఎడిషన్ లకే ఇక పరిమితం కాబోతోందా?
హైదరాబాద్: తెలుగు పత్రికా రంగంలో ఆ సంస్థ ఎన్నో ఏళ్ళుగా అగ్రస్థానంలో కొనసాగుతూ వచ్చింది.
అయితే కరోనా వైరస్ అన్ని రంగాలతో పాటు పత్రికా రంగాన్ని కూడా అతలాకుతలం చేసేసింది. దీనికి సదరు సంస్థ కూడా మినహాయింపు కాదనే చెప్పాలి.
దీంతో పాటు మీడియాలో మారుతున్న పోకడల కారణంగా ఆ సంస్థ అధినేత కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
సదరు పత్రికా ప్రింట్‌ను త్వరలోనే క్లోజ్ చేస్తారని ఆ సంస్థ ఉద్యోగులు బహిరంగంగానే చెప్తున్నారు.
భవిష్యత్‌లో ఆ సంస్థ కేవలం ఆన్లైన్ ఎడిషన్‌కే పరిమితం అవుతుందని వారి మాటల సారాంశం.
మరోవైపు సదరు అధినేత ఔషధాల వ్యాపార రంగంలోకి దిగుతున్నట్లు టాక్ నడుస్తోంది.
ఈ నేపథ్యంలో ఆ దినపత్రిక జిల్లా కార్యాలయాలు ‘మెడికల్ డిస్ట్రిబ్యూటర్’ సంస్థలుగా మారబోతున్నాయని సమాచారం.
ఈ మేరకు ఒక ప్రముఖ ఔషధ తయారీ సంస్థతో ఒప్పందం కూడా జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే ఒక యూనిట్లో పత్రిక ప్రింట్‌ను ఔట్‌సోర్సింగ్‌కు అప్పగించినట్లు తెలుస్తుంది.
ఔట్ సోర్సింగ్ ద్వారా అయితే ఉద్యోగుల పీఎఫ్, గ్రాట్యూటీ, వేజ్ బోర్డు వేతన సిఫారసులు వంటి తలనొప్పులు ఉండవని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
అందుకే త్వరలోనే తెలుగు రాష్ట్రాలలోని మరికొన్ని ప్రింటింగ్ యూనిట్లను ఔట్ సోర్సింగ్‌కు అప్పగిస్తారని విశ్లేషకులు చెప్తున్నారు.
అయితే ఈ ప్రక్రియ దశల వారీగా జరగనున్నట్లు అంచనా. 2024 ఆగస్టు వరకు మాత్రమే సదరు సంస్థ ప్రింటింగ్ కొనసాగుతుందని, ఆ తర్వాత కేవలం ఈ-పేపర్, డిజిటల్ ఎడిషన్లకు మాత్రమే పరిమితం చేస్తారని మీడియా వర్గాల్లో చర్చ నడుస్తోంది.
ఇప్పటికే సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ధాటికి మెయిన్ స్ట్రీమ్ మీడియా విలవిలలాడుతున్న సంగతి అందరికీ తెలిసిందే.