ఆక్సీజన్ సరఫరా పై, లభ్యత పై ఒక ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించిన ప్రధాన మంత్రి
దేశవ్యాప్తంగా ఆక్సీజన్ సరఫరా స్థితిగతులను సమీక్షించడానికి, ఆక్సీజన్ అందుబాటును ఏయే విధాలుగా పెంచవచ్చో అనే విషయంపై చర్చించడానికి నిర్వహించిన ఒక ఉన్నత స్థాయి సమావేశానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు.
ప్రాణవాయువు లభ్యతను మెరుగుపరచడం కోసం గత కొద్ది వారాలలో చేపట్టిన కృషిని గురించి అధికారులు ఆయన దృష్టికి తీసుకు వచ్చారు.
ఆక్సీజన్ ఉత్పత్తిని పెంచడం, ఆక్సీజన్ పంపిణీలో వేగాన్ని పెంచడం, ఆరోగ్య సంరక్షణ సదుపాయాలకు ఆక్సీజన్‌ను చేరవేయడానికి వినూత్న మార్గాలను ఉపయోగించడం అనేటటువంటి అనేక అంశాలపైన శరవేగంగా పనిచేయవలసిన అవసరాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రస్తావించారు.
రాష్ట్రాలలో ఆక్సీజన్‌కు ఉన్నటువంటి డిమాండును గురించి తెలుసుకోవడం కోసం, దానికి తగ్గట్టుగా ఆక్సీజన్‌ను సరఫరా చేసేందుకు చొరవ తీసుకోవడం కోసం రాష్ట్రాలతో సమన్వయాన్ని నెలకొల్పుకొని భారీ కసరత్తును చేస్తున్నట్లు ప్రధాన మంత్రికి వివరించడం జరిగింది.
రాష్ట్రాలకు ఆక్సీజన్ సరఫరా ఏ విధంగా నిలకడగా వృద్ధి చెందుతున్నదీ ప్రధాన మంత్రి దృష్టికి తీసుకు రావడమైంది.
20 రాష్ట్రాలలో ప్రస్తుతం రోజుకు 6,785 ఎమ్ టి ల లిక్విడ్ మెడికల్ ఆక్సీజన్ అవసరపడుతుండగా, భారత ప్రభుత్వం ఏప్రిల్ 21 నాటి నుంచి ఆ రాష్ట్రాలకు రోజు కు 6,822 ఎమ్ టి లను కేటాయించింది.
ప్రైవేటు స్టీల్ ప్లాంటులు, పబ్లిక్ స్టీల్ ప్లాంటులు, పరిశ్రమలు, ఆక్సీజన్ తయారీదారు సంస్థల తోడ్పాటుతో పాటు అంతగా ముఖ్యం కానటువంటి పరిశ్రమలకు ఆక్సీజన్ సరఫరాపై నిషేధాన్ని అమలుపరుస్తున్న కారణంగా కూడాను లిక్విడ్ మెడికల్ ఆక్సీజన్ లభ్యత గత కొన్ని రోజులలో రోజుకు దాదాపు 3,300 ఎమ్‌టి మేరకు అధికం అయినట్లు గమనించారు.
మంజూరు అయినటువంటి పిఎస్ఎ ఆక్సీజన్ ప్లాంటులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి పనిచేయించేడానికి వీలుగా రాష్ట్రాలతో తాము భుజం భుజం కలిపి పనిచేస్తున్నట్లు అధికారులు ప్రధాన మంత్రికి వివరించారు.
వివిధ రాష్ట్రాలకు సాఫీగాను, అవాంతరాలు ఎదురు కానటువంటి పద్ధతిలోను ఆక్సీజన్ సరఫరా అయ్యేటట్టు చూడవలసిందిగా అధికారులను ప్రధాన మంత్రి ఆదేశించారు.
ఏదయినా అడ్డంకి ఎదురయ్యే పక్షంలో స్థానిక పాలనయంత్రాంగం సైతం జవాబుదారుతనం వహించేటట్టుగా చూడవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు.
ఆక్సీజన్ ఉత్పత్తిని, ఆక్సీజన్ సరఫరాను పెంచేందుకు గల వేరు వేరు కొంగొత్త మార్గాలను వెతకవలసిందిగా మంత్రిత్వ శాఖలకు కూడా ఆయన సూచన చేశారు.
క్రయోజనిక్ ట్యాంకర్ల అందుబాటును బాగా వేగంగా పెంచడం కోసం నైట్రోజన్, ఆర్గాన్ ట్యాంకర్లను వాటిలో ఆక్సీజన్‌ను తరలించేందుకు వీలుగా తగిన మార్పులను చేయడం, ట్యాంకర్లను దిగుమతి చేసుకోవడం, ట్యాంకర్లను వాయు మార్గంలో చేరవేయడంతో పాటు ట్యాంకర్లను తయారీ చేయడం వంటి వివిధ చర్యలను చేపట్టడం జరుగుతోంది.
ఆక్సీజన్‌ను రాష్ట్రాలకు త్వరగా చేరవేసేటట్టు చూడవలసిన అవసరం ఎంతయినా ఉందని ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు.
శీఘ్ర గతిన రవాణా చేయడానికి, అలాగే ట్యాంకర్లను మధ్యలో ఎక్కడా ఆపకుండా దూరప్రాంతాలకు చేరవేయడానికి రైల్వేస్‌ను ఉపయోగిస్తున్న సంగతి కూడా చర్చ కు వచ్చింది.
105 ఎమ్ టి ల ఎల్ ఎమ్ ఒ తో కూడిన మొదటి రేక్ ముంబయి నుంచి వైజాగ్ కు చేరుకొంది. అదే విధంగా, ఖాళీ చేసిన ఆక్సీజన్ ట్యాంకర్లను కూడా- ఆక్సీజన్ సరఫరాలో ఒక వైపు ప్రయాణానికి పట్టే కాలాన్ని తగ్గించడం కోసం- ఆక్సీజన్ సరఫరా సంస్థలు వాయుమార్గంలో చేరవేయడం జరుగుతోంది.
ఆక్సీజన్‌ను తగిన విధంగా ఉపయోగించవలసిన అవసరాన్ని గురించి, అలాగే కొన్ని రాష్ట్రాలలో చేపట్టిన లెక్కలు రోగుల స్థితిపై ప్రభావాన్ని చూపించకుండానే ఆక్సీజన్ డిమాండును ఏ రకంగా తగ్గించిందీ అనే దానిని గురించి వైద్య సముదాయం ప్రతినిధులు సమావేశంలో వివరించారు.
దొంగనిలువలపై రాష్ట్రాలు కఠిన చర్యలను తీసుకోవాలని కూడా ప్రధాన మంత్రి స్పష్టంచేశారు.
ఈ సమావేశానికి కేబినెట్ సెక్రట్రి, ప్రధాన మంత్రి ప్రిన్సిపల్ సెక్రట్రి, హోం సెక్రట్రి, ఆరోగ్య శాఖ కార్యదర్శులతో పాటు వాణిజ్యం, పరిశ్రమ మంత్రిత్వ శాఖ , రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ, ఫార్మస్యూటికల్స్ మంత్రిత్వ శాఖ ల అధికారులు, నీతి ఆయోగ్ అధికారులు హాజరు అయ్యారు.