స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి
-ఏలూరు మండల తహశీల్దార్ బి సోమశేఖరరావు
ఏలూరు, మే 22: కొవిడ్-19 రెండవ దశను సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజల ప్రాణాలను కాపాడేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని ఏలూరు మండల తహశీల్దార్ బి సోమశేఖరరావు పిలుపునిచ్చారు.
ఏలూరు నగరంలోని పెన్షనర్స్ హాల్లో శనివారం స్వచ్ఛంద సంస్థల సభ్యులతో తహశీల్దార్ సోమశేఖర్ సమావేశం నిర్వహించారు.
ఏ సంస్థ ఏవిధంగా ప్రజలకు సేవలు అందిస్తుందో అడిగి తెలుసుకున్నారు. అనంతరం తహశీల్దార్ సోమశేఖర్ మాట్లాడుతూ కోవిడ్ సమయంలో ప్రభుత్వం అందిస్తున్న సేవలకు స్వచ్ఛంద సంస్థల సహకారం కూడా అవసరం అన్నారు.
కరోనా వైరస్ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా విస్తృతంగా ప్రచారం నిర్వహించాల్సి ఉంటుంది అన్నారు.
ఎవరైనా కోవిడ్ బారిన పడినప్పటికీ ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలన్నదే అందరి లక్ష్యమన్నారు. ముఖ్యంగా ఆక్సిజన్ కొరతను తీర్చేందుకు అందరం చర్యలు తీసుకుందామని ఆయన సూచించారు.
ఆక్సిజన్ అందక ఏ ఒక్కరు కూడా మరణించ కూడదని, ఇందుకు ప్రభుత్వానికి స్వచ్ఛంద సంస్థలు కూడా వారి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
అయితే ప్రస్తుతం కొన్ని సేవా సంస్థలు కోవిడ్ పేషెంట్లకు ఆక్సిజన్ కూడా అందించడం అభినందనీయమన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో 10 లీటర్ల సిలిండర్లు ఎక్కువగా అవసరం అవుతున్నాయని, ఇందుకు దాతల సహకారం కూడా అవసరం అన్నారు.
ఇప్పటికే కొన్ని స్వచ్ఛంద సంస్థలు కరోనా వైరస్ బారిన పడినవారికి ఆహారం, మందులు, వైద్య సలహాలు అందించడమే కాకుండా అనాధలుగా మారిన బాలికలను దత్తత తీసుకొని వారిని ఆదుకుంటున్నట్లు తెలిపారు.
అంతేకాకుండా ఆసుపత్రులలో చేరిన పేషెంట్ లతో పాటు తోడుగా వచ్చిన వారికి కూడా ఆహారం అందించడం అభినందనీయమన్నారు.
మరికొన్ని సంస్థలు మాస్కులు, శానిటైజర్ లు పంపిణీ చేయడమే కాకుండా కోవిడ్ నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
కోవిడ్ కారణంగా మరణించిన వారికి, అనాధ భౌతిక కాయలకు స్వంత ఖర్చులతో అంతిమ సంస్కారాలు కూడా నిర్వహించడం అభినందనీయమన్నారు.
ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు కలిసి సేవా కార్యక్రమాలను ముమ్మరం చేద్దామని తహశీల్దార్ సోమశేఖర్ పిలుపునిచ్చారు. వ్యవస్థను పటిష్టం చేసి ఈ సమాజానికి మరిన్ని సేవలు అందించే దిశగా ముందడుగు వేద్దామన్నారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసశీల్దార్ పీవీ చలపతిరావు, ఆర్.ఐ.లు శ్రీనివాస్ నాయక్ మరియు ఎమ్మార్వో ఆఫీస్ అధికారులు వారి సిబ్బంది నవ సమాజ్ సొసైటీ చైర్మన్ నేతల రమేష్ బాబు, సత్యసాయి సేవ ఆర్గనైజేషన్ నగర కన్వీనర్ పైడేటి రామారావు, సబ్ జోన్ కన్వీనర్ కె వెంకటేశ్వరావు, చాంబర్ ఆఫ్ కామర్స్ జిల్లా అధ్యక్షులు నేరేళ్ల రాజేంద్ర, ఫీచర్ ఇండియా ఫౌండేషన్ ఆర్గనైజింగ్ జిల్లా కార్యదర్శి ఎండి హుస్సేన్, చైల్డ్ లైన్ జిల్లా కోఆర్డినేటర్ ఎం సతీష్, యాపిల్ సేవా సంస్థ అధ్యక్షులు జె శివకృష్ణ, ది క్రేఫ్ ఆర్గనైజేషన్ సేవకులు ఎస్ రవిబాబు తదితరులు పాల్గొన్నారు.