‘ఆరు రోజులు’ చాలన్న సీఎం.. దానికే కట్టుబడిన నీలం సాహ్ని
బాధ్యతలు చేపట్టగానే నోటిఫికేషన్.. తొలి నిర్ణయంతోనే అభాసుపాలు
సుప్రీంకోర్టు ఆదేశాలు గుర్తులేవ
పోలింగ్ తేదీకి నాలుగు వారాల ముందు నుంచి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉండాలి! ఆంగ్లంలో కనీస పరిజ్ఞానం ఉన్న వారికైనా ఈ విషయం ఇట్టే తెలిసిపోతుంది! ఇది స్వయంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు.
విషయం ఇంత స్పష్టంగా ఉన్నప్పటికీ… ‘పరిషత్ ఎన్నికలు ఆపేందుకు నాకు ఎలాంటి కారణమూ కనిపించలేదు’ అని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని తేల్చేశారు. ఏప్రిల్ 8వ తేదీన పోలింగ్ అంటూ… ఒకటే తేదీన నోటిఫికేషన్ ఇచ్చారు.
మరి… సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశం గురించి ఆమెకు తెలియదా? ఎవరూ చెప్పలేదా? లేకపోతే… ‘పరిషత్ ఎన్నికలకు ఇక ఆరు రోజుల ప్రక్రియ మాత్రమే మిగిలి ఉంది’ అని ప్రభుత్వ పెద్దలు చెప్పిన మాట ప్రకారమే నిర్ణయాలు తీసుకున్నారా? ఇవీ ఇప్పుడు వ్యక్తమవుతున్న సందేహాలు!
గత ఏడాది కరోనా కారణంగా నాటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తూ… కోడ్ మాత్రం అమలులో ఉంటుందని ప్రకటించారు.
ఎన్నికల వాయిదా విషయంలో జోక్యం చేసుకునేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు.. నిరవధికంగా కోడ్ అమలులో ఉండకూడదని… పోలింగ్ తేదీకి 4వారాల ముందు నుంచి తిరిగి అమలులోకి తేవాలని స్పష్టం చేసింది.
ఇప్పుడు ఎస్ఈసీగా ఉన్న సాహ్నీయే… అప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ‘కోడ్’పై సుప్రీంకోర్టు తీర్పు ఆమె దృష్టికి వచ్చే ఉండాలి.
అయినప్పటికీ… ఈనెల 1వ తేదీన ఎస్ఈసీగా బాధ్యతలు స్వీకరించిన రోజునే… హుటాహుటిన ఆమె పరిషత్ ఎన్నికలకు రీనోటిఫికేషన్ ఇచ్చారు.
ఏడు రోజులే గడువు ఇస్తూ… ఈనెల 8వ తేదీన పోలింగ్ జరుగుతుందని ప్రకటించారు. ఇతరత్రా అన్ని అంశాలను, వాద వివాదాలను పక్కన పెట్టినా… ‘పోలింగ్ తేదీకి నాలుగు వారాల ముందు నుంచి కోడ్ అమలులోకి తేవాలి’ అనే సుప్రీంకోర్టు తీర్పును ఇది స్పష్టంగా ఉల్లంఘించడమే అని న్యాయనిపుణులు అప్పుడే చెప్పారు.
తొలి నిర్ణయానికే చుక్కెదురు: న్యాయ నిపుణులతో చర్చించారో, లేదో తెలియదు! కానీ… ఎస్ఈసీగా నీలం సాహ్ని తీసుకున్న తొలి నిర్ణయమే బెడిసికొట్టింది.
సుప్రీం తీర్పు మేరకు నాలుగు వారాల కోడ్‌తో ఎన్నికలు నిర్వహించేందుకు తనకు సమయం లేనందునే పరిషత్ ఎన్నికలు జరపడంలేదని నిమ్మగడ్డ రమేశ్ కుమార్ స్పష్టంగా చెప్పారు. తదుపరి ఎస్ఈసీకి ఆ బాధ్యత వదిలివేస్తున్నట్లు తెలిపారు.
కానీ… నీలం సాహ్ని మాత్రం, ‘పరిషత్ ఎన్నికల నిర్వహణకు నాకు ఎలాంటి అడ్డంకులూ కనిపించడం లేదు’ అంటూ రాత్రికి రాత్రి నోటిఫికేషన్ ఇచ్చేశారు.
వాస్తవానికి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల విషయంలో అనేక వివాదాలు అలుముకున్నాయి. ఎప్పుడో ఏడాది కిందట ఆగిపోయిన ఎన్నికల ప్రక్రియ ఇది.
అప్పట్లో అధికార పార్టీ దౌర్జన్యాలు, బలవంతపు ఏకగ్రీవాలపై నిమ్మగడ్డ స్వయంగా కేంద్రానికి ఫిర్యాదు చేశారు. అసాధారణ రీతిలో ఏకగ్రీవాలు జరిగిన తీరును వివరించారు.
ఈ ఏడాది కాలంలో ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో పలువురు మరణించారు. కొందరు పార్టీలు మారారు. వీటన్నింటి నేపథ్యంలో తాజా నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికల ప్రక్రియను మొదటి నుంచి జరపాలన్నది విపక్షాల డిమాండ్.
దీనిపై కొందరు హైకోర్టును కూడా ఆశ్రయించారు. దీని గురించి కూడా నీలం సాహ్ని పట్టించుకోలేదు. ఆమె చీఫ్ సెక్రెటరీగా ఉన్నప్పుడు ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు నడుచుకుని… రెండుసార్లు హైకోర్టు ముందు హాజరు కావాల్సి వచ్చింది.
ఇప్పుడు ఎస్ఈసీగా తీసుకున్న హడావుడి నిర్ణయంతో అభాసుపాలయ్యారని ఐఏఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
గురువారం జరగాల్సిన పరిషత్ ఎన్నికలకు ఏర్పాట్లు వివరించేందుకు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది మంగళవారం సాయంత్రం 4 గంటలకు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
సరిగ్గా అదే సమయానికి పోలింగ్‌కు ‘బ్రేక్’ వేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించిందని తెలిసింది. దీంతో ద్వివేదీ మీడియా ముందుకు కూడా రాలేదు. విలేకరుల సమావేశాన్ని రద్దు చేశారు.