విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటుపాలు తప్పదా?
ఉద్యమాలు లేఖలు అన్నీ వృధానేనా?
స్టీల్ ప్లాంట్ వివరాలను కోరిన ప్రధాని.
ఢిల్లీని తాకని ఉద్యమాలు.
జై అనకాపల్లి సేన అధ్యక్షుడు కొణతాల సీతారాం…
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలంటూ ప్రస్తుతం ఒకవైపు నగరంలో ఉద్యమాలు జరుగుతున్నాయి, మరోవైపు ఈ విషయంపై పునరాలోచన చేయాలని సక్షాత్తు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రధానికి లేఖ కూడా వ్రాసారు. ఉద్యమాలు, ముఖ్యమంత్రి జగన్ ప్రధానికి రాసిన లేఖ అన్నీ వృధా అయినట్లే అన్పిస్తుందని జై అనకాపల్లి సేన అధ్యక్షుడు కొణతాల సీతారాం ఆవేదన వ్యక్తంచేశారు.
స్థానిక విలేకరులతో కొణతాల సీతారాం మాట్లాడుతూ ఇప్పటికే స్టీల్ ప్లాంట్ వివరాలను ప్రధాని కోరినట్లు పక్క సమాచారం ఉందని అన్నారు.
రాజకీయ పార్టీలు ధర్నాలు, ర్యాలీలు, దీక్షలు చేపడుతున్నా. మరోవైపు ప్రైవేటీకరణ వద్దంటూ ప్రధానికి సీఎం జగన్ లేఖ కూడా రాయడమే కాకుండా త్వరలో అసెంబ్లీ తీర్మానం చేసేందుకు కూడా వైసీపీ సర్కారు సిద్ధమవుతున్నా కేంద్రం ఇవన్నీ పట్టించుకునే పరిస్ధితుల్లో లేనట్లు తేలుస్తోంది అన్నారు.
ఎన్నికల ప్రక్రియ సాగుతున్న తరుణంలోనే స్టీల్ ప్లాంట్ ఉద్యమంపై కేంద్రం వేగంగా అడుగులు వేయడం చూస్తుంటే రాజకీయంగా తమకు దీని వల్ల ఎలాంటి నష్టం లేదనే అంచనాకు వచ్చేసిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అన్నారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ వివరాలు కోరిన కేంద్రం
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణలో కీలకమైన బిడ్డింగ్ విధానం కోసం అవసరమైన సాంకేతిక వివరాలు ఇవ్వాలని అధికారులకు తాజాగా కేంద్రం ఈ మెయిల్ చేసినట్లు సమాచారం వచ్చిందని. ప్రైవేట్ బిడ్డింగ్ వివరాలతో పాటు లాభనష్టాలు, ఆస్తులు, అప్పులు, ఇతర వివరాలను కూడా కోరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి అన్నారు.
సాధ్యమైనంత త్వరగా ఈ వివరాలు ఇవ్వాలని కేంద్రం కోరినట్లు తెలుస్తోంది అని దీంతో వచ్చే నెలలో ఈ వివరాలు పంపే అవకాశం ఉందని సీతారాం అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇప్పటికయినా పోయింది ఏమి లేదని విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో విశాఖలో జరుగుతున్న ఉద్యమాన్ని ఢిల్లీకి తాకేలా అధికార పార్టీ అందరిని సమాయత్తం చేయాలని సీతారాం సూచించారు.
ప్రభుత్వానికి చేతకాకపోతే జై అనకాపల్లి సేన అందరినీ కలుపుకుని ప్రధాని ఇంటి ముందు ధర్నా చేపట్టి తెలుగు వాడి వేడి ఏంటో రుచి చూపించి స్టీల్ ప్లాంట్ ను రక్షించుకుంటామని కొణతాల సీతారాం ఈ సందర్భంగా స్పష్టం చేశారు.