వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి..
చైర్ పర్సన్ దుర్గారాణి..
మండపేట: పట్టణ పరిధిలో టీమ్ సురక్ష సభ్యుల ఆధ్వర్యంలో, దాతల సహకారంతో నిర్వహిస్తున్న వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గారాణి పేర్కొన్నారు.
29వ వార్డులోని సత్య శ్రీ రోడ్ లో సర్దార్ శ్రీ వేగుళ్ళ వీర్రాజు మున్సిపల్ హైస్కూల్ నందు మంగళవారం ఏర్పాటుచేసిన వైద్య శిబిరాన్ని చైర్ పర్సన్ రాణి, మున్సిపల్ కమిషనర్ రామ్ కుమార్ లు ప్రారంభించారు.
కరోనా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో దాతల సహకారంతో టీమ్ సురక్ష సభ్యులు ప్రజలకు అందిస్తున్న సేవలు అభినందనీయమని చైర్ పర్సన్ దుర్గారాణి అన్నారు.
వైద్య శిబిరం నిర్వహణకు సహకరించిన వట్టికూటి వెంకట్రావు చౌదరి, గడ్డపు జయ నరసింహారావులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత, భౌతిక దూరం, మాస్క్ ధరించడం వంటి కనీస జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిల్ సభ్యులు, టీం సురక్ష సభ్యులు తదితరులు పాల్గొన్నారు.