అతడికి వ్రాడం కూడా సరిగా రాదు అయితేనేం నకిలీ ధృవపత్రాలతో బ్యాంకులకు ఏకంగా రెండు కోట్ల రూపాయలకు కుచ్చు టోపీ పెట్టగలిగాడు
నకిలీ పాసుపుస్తకాలు, పహాని, 1 బి నమూనా మరియు నకిలీ స్టాంపులతో బ్యాంకులో రుణాలు ఇప్పించిన ముఠా గుట్టురట్టు చేసిన సిసిఎస్ పోలీసులు
12 మంది అరెస్ట్, పరారీలో ఐదుగురు
Rs 5,55,000 రూపాయల నగదు, నకిలీ పాసు పుస్తకాలు, రబ్బర్ స్టాంపులు, ఆడంగళ్/పహాని, 1-B నమూన, మరియు జన్యూనస్ సర్టిఫికేటులు స్వాధీనం.
కాదేదీ నకిలీకి అనర్హం అన్న చందంలో కొతమంది మోసగాళ్ళు సులువుగా డబ్బులు సంపాదించాలనే దురాశతో సాగిపోతుంటారు.
మెదడులో మోసంచేయాలి అనే ఆలోచన మెదిలితే చాలు లేని భూమి ఉన్నట్టు నకిలీ పాసు పుస్తకాలు, రబ్బరు స్టాంపులు దేన్నైనా నకిలీ చేసేసి సొమ్ము చేసుకుంటున్నారు.
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి జిల్లా రామగిరి, ముత్తారం మండలానికి చెందిన 153 మంది రైతులు 2016-18 సంవత్సరాల తెలంగాణ గ్రామీణ బ్యాంకులో దాదపు రూ.2 కోట్లు రుణాలు తీసుకున్నారు.
2019 డిసెంబర్లో ఋణాలు చెల్లించాలంటూ రైతులకు నోటీసులు జారీ చేయగా ఒక్క రైతు కూడా రుణాలు చెల్లించకపోవడంతో అనుమానం వచ్చిన బ్యాంకు మేనేజర్ రికార్డులను పరిశీలించారు.
అనుమానం రావడంతో విచారణలో భాగంగా సంబంధిత భూమి వివరాలను ముత్తారం మరియు రామగిరి తహశీల్దార్ కార్యాలయానికి పంపారు.
అక్కడే అసలు విషయం బయట పడింది, రైతుల పాసు పుస్తకాలు, ఆడంగళ్/పహాని, 1-B నమూన, మరియు జన్యూనస్ సర్టిఫికేట్ లు అన్నీ కూడా నకిలీవని తేలాయి.
వెలుగుచూసిన ఈ నిజాలతో సదరు మేనేజరు నిర్ఘాంతపోయారు.
అక్రమాలకు పాల్పడిన 153 మందిపై రామగిరి పోలీసులకు బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
సీపీ ఆదేశాల మేరకు డిసిపి అడ్మిన్ పర్యవేక్షణలో సిసిఎస్ పోలీసులకు కేసు దర్యాప్తు నిమిత్తం అప్పగించారు.
సిసిఎస్ ఇన్స్పెక్టర్ లు మహేందర్ రెడ్డి, వెంకటేశ్వర్లు, ఎస్ఐ అశోక్ లు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి బ్యాంకును సందర్శించి రికార్డ్లులను పరిశీలించారు.
దర్యాప్తులో భాగంగా అనుమానుతులను పోలీసు వారి ఆధీనంలోకి తీసుకోని విచారించగా అసలు సూత్రధారి ముత్తారం మండలంలోని మైదంబండ గ్రామానికి చెందిన పందుల ప్రభాకర్ అలియాస్ ప్రవీణ్ గా గుర్తించారు.
2016 నుండి 2019 వరకు తెలంగాణ గ్రామీణ బాంకు, సెంటినరీ కాలనీ బ్రాంచ్ మేనేజరుకు కార్ డ్రైవరుగా పని చేసాడు.
ఆ సమయంలోనే బాంకు క్రాప్ లోన్ ఏ విధంగా తీసుకోవచ్చో అందుకు ఏ ఏ పత్రాలు అవసరం అవుతాయి తనకు తెలిసింది.
విలాసవంతమైన జీవితానికి తన సంపాదన సరిపోదని భావించిన ప్రవీణ్ కు ఒక మోసపూరితమైన ఆలోచన వచ్చింది.
క్రాప్ లోన్ తీసుకోవడానికి సంభందించిన అన్నీ పత్రాలు డూప్లికేట్ వి తయారు చేసి, తనకు బ్యాంకులో గల పరిచయాల ద్వారా లోన్లు ఇప్పించి సులువుగా డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు.
ముత్తారం తహశీల్దార్ ఆఫీసు ముందు జిరాక్స్ షాప్ నిర్వహించి కుక్కడపు అశోక్ తో అప్పటికే తనకు స్నేహం ఉంది.
ఆ పరిచయంతోనే అశోక్ ను సంప్రదించి అతడికి నకిలీ పత్రాల ద్వారా అక్రమంగా పంట ఋణం ఇప్పించి కమీషన్ తీసుకోవచ్చని తెలిపాడు.
సులువగా డబ్బు సంపాదించవచ్చునని భావించిన అశోక్ కూడా దీనికి ఒప్పుకున్నాడు.
అశోక్ వద్ద ఆడంగళ్/పహాని, 1-B నమూన, మరియు తహశీల్దార్ ఇచ్చే జన్యూనస్ సర్టిఫికేట్ ల జిరాక్స్ సెట్ లు తీసుకొన్నాడు ప్రవీణ్.
ఆ తర్వాత రబ్బర్ స్టాంపుల కోసం పెద్దపల్లిలో సుధాకర్ అనే రబ్బరు స్టాంపుల తయారీదారును సంప్రదించారు.
ప్రవీణ్ మరియు అశోక్ ఇద్దరు పెద్దపల్లికి వెళ్ళి సుధాకర్ వద్ధ , RDO, డెప్యూటీ తహశీల్దార్, తహశీల్దార్, VRO స్టాంపులను తయారు చేయించుకుని వచ్చారు.
ఆ తర్వాత పట్టాపాస్ & టైటిల్ డీడ్ బుక్ ల కోసం అప్పుడు VRA గా ఉంటూ మంథని RDO జీప్ డ్రైవరు గా పనిచేస్తున్న ముత్తారం గ్రామానికి చెందిన మడిగ సదన్న అలియాస్ సదానందంను సంప్రదించారు.
విషయం అర్ధమయిన సదానందం ఒక్కో పట్టా పాస్ బుక్, టైటిల్ డీడ్ కి రూ 3500/- ఇస్తే సహకరించేందుకు ఒప్పుకున్నారు.
అప్పటి నుండి ప్రవీణ్ అవసరాన్ని బట్టి కావలసిన దస్త్రాలు డబ్బులు ఇచ్చి తీసుకున్నాడు.
ప్రవీణుకి రాయడం సరిగా రానందున తనకు కావలసిన దస్త్రాలు ఒక్కొక్క డాక్యుమెంట్ కి రూ 2000/- చొప్పున ఇచ్చి వ్రాయించుకునేందుకు తనకు తెలిసిన కొంతమందితో ఒప్పందం కుదుర్చుకున్నాడు.
ప్రవీణ్ తన ఊరిలోనే కాక చుట్టుపక్కల ఊర్ల రైతులను మరియు ఇతరులను సంప్రదించి భూమి లేనివారికి కూడా క్రాప్ లోన్ ఇప్పిస్తామని, భూమి లేనివారికి క్రాప్ లోన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ఒక జి. వో. విడుదల చేసిందని నమ్మబలికాడు.
ఈ తతంగం అంతా హైదరాబాద్ నుండి జిరిపంచాలని, తరువాత ప్రభుత్వం వారు ఋణ మాఫీ చేస్తారని, మీకు వ్యవసాయ ఖర్చులకి బ్యాంక్ నుండి లోను ఇప్పించే బాధ్యత నాది అని, రైతులని నమ్మించాడు.
ఈ విధంగా రైతుల నుండి అవసరమైన ఆధార్ కార్డు వివరాలు, ఫోటోలు సేకరించి తనకు అండగా ఉన్న తన ముఠా సభ్యులతో కలిసి కావలసి నకిలీ దస్త్రాలను సృష్టించి బ్యాంకులో ఋణాలకు దరఖాస్తులు పెట్టించాడు.
అయితే దస్త్రాలు నకిలీవి అయినందున ఫీల్డ్ ఎంక్వయిరీకి వస్తే అసలుకే మోసం వస్తుందని గ్రహించిన ప్రవీణ్ ఎటువంటి ఫిల్డ్ ఎంక్వయిరీ లేకుండా ఋణాలు మంజూరు చేసేందుకు ఒక్కొక్క ఫైలుకు రూ.5000 ఇచ్చేందుకు అప్పటి బ్యాంకు మానేజర్లతో ఒప్పందం కుదుర్చుకున్నాడు.
ఈ ప్రక్రియ ద్వారా ఒక్కరికి దాదపు లక్ష రూపాయల మేర రుణాలు ఇప్పించాడు.
అందుకు గాను ఒక్కొక్కరి నుండి 15 వేల నుండి 30 వేల వరకు కమీషన్ తీసుకునేవాడు.
లోన్ పొందేందుకు కావలసిన పత్రాలు వ్రాసి, నకిలీ సంతకాలు చేసి స్టాంపులు వేసిన వారికి మనిషికి రెండు వేల రూపాయలు ఇచ్చేవాడు.
ఈ విధంగా 2016 నుండి 2019 వరకు తెలంగాణ గ్రామీణ బ్యాంక్, సెంటీనరీ కాలనీ బ్రాంచ్ లో తాని ఇప్పించిన క్రాప్ లోన్ ల నుండి తనకు దాదాపు రూ 3 లక్షల పైన కమీషన్ గా వచ్చిదని ప్రవీణ్ తెలిపాడు.
ఈ కేసులో ప్రవీణ్ సహా తనకు సహకరించిన వారిని మొత్తం 12 మందిని అదుపులోకి తీసుకున్నారు.
వీరికి తోడుగా ఉన్న మరో ఐదుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు గుర్తించారు.
పట్టుబడిన నిందితుల నుండి Rs.5,55,000 రూపాయల నగదు, నకిలీ పాసు పుస్తకాలు, రబ్బర్ స్టాంపులు, ఆడంగళ్/పహాని, 1-B నమూన మరియు జన్యూనస్ సర్టిఫికేట్లు స్వాధీన పరచుకున్నట్లు సిపి తెలిపారు.
ఈ కేసులో మొసగాళ్ళ మాటలు నమ్మి ఋణాలు తీసుకున్న రైతులను సాక్షులుగా, బాధితులు గానే పరిగణిస్తూ వారు చెప్పే సాక్ష్యంని వాంగ్మూలంగా రికార్డు చేసినట్లు పోలీసులు తెలిపారు.