కరోనా పరీక్షలు చేయండి సారు…
పిహెచ్సిల్లో అరకొరగానే కరోనా పరీక్షలు
అయోమయ పరిస్థితిలో అనుమానితులు
ప్రైవేట్ ల్యాబ్స్ లో పుష్కలంగా కరోనా పరీక్షలు
కొత్తపేట: కరోనా సెకండ్ వేవ్ ఉగ్రరూపు చూపడంతో ఎవరికి కరోనా ఉందో లేదో తెలియని పరిస్థితి. ప్రస్తుత పరిస్థితుల్లో ఏదో ఒక పని చేసుకుంటేనే కుటుంబం ముందుకు వెళుతుంది.
కొంతమంది పని నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లి వస్తుంటారు. ఇటువంటి వారిలో కరోనా లక్షణాలు కనిపిస్తే అనుమానంతో కరోనా టెస్ట్ కోసం ఆసుపత్రులకు వెళ్తున్నారు.
తీరా అక్కడికి వెళ్ళాక అక్కడ ఉన్న వైద్య సిబ్బంది ప్రస్తుతానికి కిట్లు లేవని రెండు రోజుల తర్వాత వస్తాయని చెప్పడంతో అటు ఇంటికి వెళ్లాలా ఆసుపత్రికి వెళ్లాలా తెలియని పరిస్థితుల్లో అనుమానితులు కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి కొత్తపేట నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్నాయి.
కొత్తపేట నియోజకవర్గంలో పలు పిహెచ్సీలు ఉండగా ఆయా ఆసుపత్రుల్లో అరకొరగానే టెస్టులు నిర్వహిస్తున్నారు.
నామమాత్రంగానే టెస్టులు నిర్వహిస్తుండడంతో కరోనా అనుమానితులు ద్వారా ఈ వ్యాధి మరింత మందికి వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని ప్రజలు వాపోతున్నారు.
సుమారు 100 మందికి కరోనా లక్షణాలు ఉంటే 25 మందికి మాత్రమే టెస్టులు చేయడానికి పిహెచ్సి ల వద్ద కరోనా టెస్టింగ్ కిట్లు ఉంటున్నాయి.
దీంతో మిగతా వారు రెండు మూడు రోజులు వేచి ఉండాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. గర్భిణీలకు అత్యవసర పరిస్థితుల్లో కరోనా పరీక్షలు చేయడానికి ఎక్కడా కిట్లు ఉండటం లేదు.
ఈ పరిస్థితుల్లో కరోనా అనుమానితులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా సోకిందా లేదా అన్న అనుమానం తో తీవ్ర భయాందోళనకు లోనవుతున్నారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొరత… ప్రైవేట్ ల్యాబ్ లో పుష్కలం.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో కిట్ల కొరత ఎక్కువగా ఉన్నా అనధికారికంగా ప్రైవేట్ ల్యాబ్ లలో కిట్లు పుష్కలంగా ఉంటున్నాయి.
కరోనా పరీక్షలు కేవలం ప్రభుత్వ పీహెచ్సీల్లో మాత్రమే నిర్వహించాలి. అనుమతులు ఉన్న ల్యాబ్ లో మాత్రమే పరీక్షలు చేయాలి మరెక్కడా కూడా కరోనా పరీక్షలు చేయరాదు.
కానీ బయట మార్కెట్ లో చూస్తే 1500 నుండి 2000 వరకు సొమ్ములు తీసుకుని పరీక్ష నిర్వహిస్తున్నారు.
కొంతమంది ధనికుల ప్రైవేట్ ల్యాబ్లను ఆశ్రయిస్తుoడగా, పేద వారు మాత్రం వేల రూపాయలు పెట్టి బయట మార్కెట్లో పరీక్ష చేయించుకోలేక ప్రభుత్వ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు.
కరోనా పరీక్షలు బయట చేయరాదని నిబంధన ఉన్నా ప్రభుత్వ ఆసుపత్రుల్లో లేని కిట్లు ప్రైవేటుగా ఎందుకు లభిస్తున్నాయని పలువురు ప్రశ్నిస్తున్నారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి పూర్తి స్థాయిలో పిహెచ్ లకు కరోనా కిట్లు పంపిణీ చేసి కరోనా అనుమానితులకు వెంటనే పరీక్షలు నిర్వహించి మరింత మందికి ఈ వ్యాధి ప్రభలకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.