బ్యాలెట్ పత్రాలు సోషల్ మీడియాలో హల్ చల్…
బయటకు వచ్చిన బ్యాలెట్ పత్రాల అంశంపై విచారణ చేయాలి…
బాధ్యులపై సత్వరం చర్యలు తీసుకోవలని కోరుతున్న ప్రజలు
మండపేట:- మండపేటలో అధికార పార్టీ కార్యకర్తలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని. బరి తెగింపుతో వ్యవహరిస్తున్న అధికారులు వారికి సహకారం అందజేయడం విడ్డురం అంటూ అక్కడి ప్రజలు వాపోతున్నారు.
బ్యాలెట్ పత్రాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేయడం ఇప్పుడు వివాదాస్పదమైంది. ఈ ఉదంతంలో కొందరు పిఓలు సైతం సహకరిస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు.
దీనిపై చర్యలకు పలు పార్టీల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మండపేట మండలంలోని ద్వారపూడి, ఏడిద సీతానగరం, మరేడు బాకల్లో బయటకు వచ్చిన బ్యాలెట్ పత్రాలపై విచారణ చేయాలని ప్రజలు కోరుతున్నారు.
ఆయా పి ఓ లను సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఫ్యాక్స్‌లో కొందరు ఫిర్యాదు చేశారు.
గతంలో మండపేట అసెంబ్లీ ఎన్నికల్లో మరేడు బాకలో బ్యాలెట్ పత్రాలు చెత్త కుప్పలో పడితే దీనిపై పెద్ద దుమారం రేగింది.
అప్పట్లో ఆ పి ఓ తో బాటు అప్పటి మండపేట నియోజకవర్గ ఎన్నికల అధికారిని సైతం సస్పెండ్ చేశారు. ఆ తర్వాత ఆయన గుండె పోటుతో మృతి చెందారు.
కాగా మండపేట మండలంలోని ద్వారపూడిలో ఓ వ్యక్తి, ఏడిద సీతానగరం, మారేడు బాకల్లో బ్యాలెట్ పత్రంలో ఓటు ముద్రించి అనంతరం సెల్ లో ఫోటోలు తీశినట్లు తెలుస్తుంది.
వాటిని కొన్ని వాట్స్ అప్ గ్రూప్‌లలో పోస్ట్ చేసారు. అవి కాస్తా మిగిలిన గ్రూపుల్లో తిరుగుతూ మొత్తం సామాజిక మాధ్యమాల్లో చుట్టింది.
దీనిపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని ఇందులోని నిజానిజాలను నిగ్గు తేల్చాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.