రాష్ట్రంలో పెరిగిపోతున్న కరోనా కెసుల దృష్ట్యా మాజీ మంత్రి సోమిరెడ్డి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ మేరకు ఆయన రాష్ట్ర ముఖ్య మంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డిని ఘాటుగా విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సూచనలు విమర్శలు ఆయన మాటల్లోనే…
“నేను ఉన్నాను…నేను విన్నాను అన్న ముఖ్యమంత్రి ఇప్పుడెక్కడ…ప్రజల చావుకేకలు జగన్మోహన్ రెడ్డికి వినిపించడం లేదా..
కరోనా రెండోదశ వ్యాప్తిపై ప్రభుత్వం, సీఎం మేల్కొనకపోతే, ఏపీలో పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది.
ఎన్నికల నిర్వహణ సమయంలో కరోనా రెండోదశ ప్రమాదకరంగా మారనుందని చెప్పిన సీఎం ప్రజల ప్రాణాలు పోతున్నా ఇప్పుడెందుకు పట్టించుకోవడంలేదు?
ఆటోలు, వ్యానులు, అంబులెన్సుల్లోనూ, రోడ్లపైనే ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే సీఎంకి కనిపించడంలేదా?
తొలిదశ కరోనా సమయంలో తీసుకున్న కొద్దిపాటి చర్యలు, జాగ్రత్తలను ఇప్పుడు తీసుకోవడంలేదు.
ఆక్సిజన్ కొరత, వెంటిలేటర్ బెడ్లు లేక అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారు.
సౌకర్యాల విషయంలో ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందకపోవడంతో వైద్యులు, నర్సులు నిస్సహాయ స్థితిలో ఉన్నారు.
2 లక్షల 20 వేల కోట్ల బడ్జెట్ కేటాయింపులు చేసిన ప్రభుత్వం 1000 కోట్లను ప్రజల ప్రాణాలకోసం ఇప్పుడు ఖర్చుచేయలేదా?
తక్షణమే ప్రభుత్వం, ముఖ్యమంత్రి మేల్కొనకపోతే, విజయనగరం ఘటనలాంటి పరిస్థితులే పునరావృతమయ్యే ప్రమాదముంది..
ఆసుపత్రుల్లో సౌకర్యాల కల్పన ఆక్సిజన్ సిలిండర్ల ఏర్పాటు, ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లింపు వంటివాటిపై ప్రభుత్వం వెంటనే దృష్టిపెట్టాలి.
ప్రపంచ యుద్ధాల సమయంలో కూడా లేనటువంటి ఆరోగ్య అత్యవసర స్థితి రాష్ట్రంలో ఉందని జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలి.
ప్రజలు ప్రాణాలు కోల్పోయాక, ఆర్థికంగా కుటుంబాలకు కుటుంబాలే చితికిపోయాక ఈ ప్రభుత్వం మేల్కొంటే ఉపయోగం లేదు..
ఇప్పటికే మధ్యతరగతి ప్రజలు నిరుపేదలుగా మారిపోతున్నారు..
ప్రభుత్వ సలహాదారులు గా 42 మందిని నియమించుకున్న జగన్మోహన్ రెడ్డి ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఆరోగ్యరంగ నిపుణులను ఎందుకు నియమించుకోలేకపోతున్నారు…
కళ్యాణ మండపాలను, కళాశాలలను వెంటనే క్వారంటైన్ కేంద్రాలుగా మార్చి, తక్షణమే పారామెడికల్ సిబ్బందిని నియమించాలి.
సీరియస్ కండీషన్లో ఉన్నవారిని ఆసుపత్రులకు తరలించి, కొద్దిపాటి లక్షణాలతో బాధపడుతున్న వారికి తాత్కాలిక కేంద్రాల్లోనే చికిత్స అందించాలి..
చికిత్స ఖర్చు వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తామన్న సీఎం మాటలు ఇప్పుడేమయ్యాయి..
ఆరోగ్య శ్రీ కింద ప్రజలకు ఎందుకు వైద్యం అందించలేకపోతున్నారు..
చివరకు ఉద్యోగులకు వర్తించే ఈహెచ్ఎస్ ను కూడా దక్కకుండా చేశారు..
ఆసుపత్రులకు బకాయి ఉన్న ఆరోగ్యశ్రీ బిల్లులను ప్రభుత్వం ఇంతవరకు ఎందుకు చెల్లించలేకపోయింది…
కోవిడ్ రోగులందరికీ వైద్యం అందాలని, ఆరోగ్యశ్రీ కింద వారికి సేవలు అందించాలని, అవసరమైన చెల్లింపులను ప్రభుత్వమే చేస్తుందనే మాట చెప్పి ఉంటే, నేడు పరిస్థితి ఇంత దారుణంగా ఉండేది కాదు.
అదనపు సౌకర్యాలు కల్పించడం, రెండో దశ కరోనా వ్యాప్తికి తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రభుత్వం ఆలోచన చేయకపోవడం క్షమించరాని నేరం..
కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ, ప్రభుత్వం కరోనా కట్టడికి చర్యలు తీసుకోకుంటే దారుణమైన స్థితిని చూడాల్సి వస్తుంది.
తమిళనాడు ప్రభుత్వం తమ రాష్ట్రంలోని ఆక్సిజన్ ను తామే వినియోగించుకోవడానికి అనుమతించాలని కేంద్రాన్ని కోరింది..అదేగనుక జరిగితే సరిహద్దులోని చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పరిస్థితి దారుణంగా మారుతుంది..
ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని తక్షణమే ఆసుపత్రులకు అవసరమైన మౌలిక సౌకర్యాలను, పరికరాలను యుద్ధప్రాతిపదికన సమకూర్చాలి…
ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించేలా ఆరోగ్యనిపుణల బృందాన్ని నియమించాలి..
కేజ్రీవాల్ మాదిరిగా ధైర్యంగా ప్రధానితో మాట్లాడి, రాష్ట్రానికి అవసరమైన వాటిని ముఖ్యమంత్రి వెంటనే రప్పించుకోవాలి..
వెంటనే రాష్ట్రంలో లాక్ డౌన్ పెట్టే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలించాలి.”
అంటూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జగన్ పైనా రాష్ట్ర ప్రభుత్వం పైనా ధ్వజమెత్తారు.