మాజీ మంత్రి చందూలాల్ కన్నుమూత
కరోనాతో చికిత్స పొందుతూ మృతి
తెలంగాణా మాజీ మంత్రి, తెరాస నేత అజ్మీరా చందూలాల్ (67) గురువారం రాత్రి హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో అనారోగ్యంతో కన్నుమూశారు.
మూడు రోజుల కిందట కరోనాతో ఆసుపత్రిలో చేరిన ఆయన పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు.
ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు మండలం జగ్గన్నపేటలో 1954 ఆగస్టు 17న జన్మించిన ఆయన సర్పంచిగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు.
మూడుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఎంపీగా, రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్ హయాంలో, తెలంగాణలో కేసీఆర్ హయాంలో రెండుసార్లు మంత్రిగా పనిచేశారు. 1996, 1998లలో లోక్‌సభ సభ్యునిగా గెలిచారు. 2005లో తెరాసలో చేరారు. ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యునిగా పనిచేశారు.
సీఎం సంతాపం
చందూలాల్ మృతిపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మంత్రులు కేటీరామారావు, హరీశ్‌రావు, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, శ్రీనివాస్‌గౌడ్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ తదితరులు సంతాపం తెలిపారు. శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.