ఐడిబిఐ బ్యాంక్లో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ మరియు నిర్వహణ నియంత్రణ బదిలీకి కేబినెట్ ఆమోదం
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ అధ్యక్షతన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ, ఐడిబిఐ బ్యాంక్ లిమిటెడ్లో నిర్వహణ నియంత్రణ బదిలీతో పాటు వ్యూహాత్మక పెట్టుబడుల కోసం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది.
ఆర్బిఐతో సంప్రదించి ఈ లావాదేవీ కార్యరూపం దాల్చే సమయంలో భారత ప్రభుత్వం మరియు ఎల్ఐసి ద్వారా సంబంధిత వాటాల యొక్క పరిధి నిర్ణయించబడుతుంది.
భారత ప్రభుత్వం(భా.ప్ర.) మరియు ఎల్ఐసి కలిసి ఐడిబిఐ బ్యాంక్ (భా.ప్ర. 45.48%, ఎల్ఐసి 49.24%) ఈక్విటీలో 94% కంటే ఎక్కువ వాటాను కలిగి ఉన్నాయి.
ఎల్ఐసి ప్రస్తుతం ఐడిబిఐ బ్యాంక్ ప్రమోటరుగా వ్యవహరిస్తూ మేనేజ్మెంట్ కంట్రోల్ కలిగి ఉండగా భా.ప్ర. సహ ప్రమోటర్ గా వ్యవహరిస్తోంది.
ఐడిబిఐ బ్యాంక్ లిమిటెడ్లో ఎల్ఐసి తన వాటాను తగ్గించేందుకు ఎల్ఐసి బోర్డు ఒక తీర్మానాన్ని ఆమోదించింది.
ప్రస్తుత ధరలు, మార్కెట్ దృక్పథం, చట్టబద్ధమైన నిబంధనలు మరియు పాలసీదారుల ఆసక్తిని పరిగణనలోకి తీసుకోవడం ద్వారా ప్రభుత్వ వ్యూహాత్మక వాటాల అమ్మకాలతో పాటు తన వాటాను సైతం అమ్మడం ద్వారా ఎల్ఐసి బ్యాంకు యొక్క నిర్వహణ నియంత్రణనుండి తప్పుకునేందుకు సిద్ధమౌతుంది.
ఈ లావాదేవీలో ఎల్ఐసి బోర్డు యొక్క ఈ నిర్ణయం బ్యాంకులో తన వాటాను తగ్గించడానికి రెగ్యులేటరీ ఆదేశాలకు అనుగుణంగా ఉండనుంది.
ఐడిబిఐ బ్యాంక్ లిమిటెడ్ యొక్క వ్యాపార సంభావ్యత మరియు వృద్ధికి సరైన అభివృద్ధి కోసం వ్యూహాత్మక కొనుగోలుదారు నిధులు, కొత్త సాంకేతిక పరిజ్ఞానం మరియు ఉత్తమ నిర్వహణ పద్ధతులను ప్రేరేపిస్తారని భావిస్తున్నారు.
అంతేగాక ఎల్ఐసి మరియు ప్రభుత్వ సహాయం లేదా నిధులపై ఆధారపడకుండా ఎక్కువ వ్యాపారాన్ని బ్యాంకు సృష్టించుకునేందుకు ఈ చర్య దోహదం చేయనుంది.
ప్రభుత్వ వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా సమకూరే వనరులు పౌరులకు ప్రయోజనం చేకూర్చే ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు ఆర్థిక సహాయం చేయనున్నట్లు ప్రభుత్వం భావిస్తోంది.