సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిపై కలెక్టర్ కన్నేర్ర
ఏపీ ఎమ్ఐపీ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆస్పత్రిలో అడ్మిట్ అయినపుడు జరిగిన సంఘటనలపై అనంతపురం జిల్లాకలెక్టర్ కన్నెర్ర.
సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సూపరింటెండెంట్, ఇద్దరు హెడ్ నర్సులకు షోకాజ్ నోటీసులు జారీ.
ఇద్దరు డాక్టర్ల సస్పెన్షన్
అనంతపురము, మే 16
సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఏపీ ఎమ్ఐపీ పీడీ సుబ్బరాయుడు అడ్మిట్ అయినపుడు జరిగిన సంఘటనలను జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తీవ్రంగా పరిగణించారు.
అందుకు కారణమయిన పలువురు సిబ్బందిపై చర్యలు తీసుకున్నారు.
కరోనా బారిన పడి ఆరోగ్యం క్షీణించిన పీడీ సుబ్బరాయుడు వైద్యం కోసం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి వచ్చిన సమయంలో హెల్ప్ డెస్క్ వద్ద అందుబాటులో లేని డా.సుధాకర్, ఆ సమయంలో విధులకు హాజరవ్వని రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ డా.శ్రీధర్ లను సస్పెండ్ చేశారు.
పని చేయని ఆక్సిజన్ ఫ్లో మీటర్లు మార్చక పోవడం, స్ట్రెచర్ అందుబాటులో లేకపోవ డాన్ని కలెక్టర్ తీవ్రంగా పరిగణించారు.
అంబులెన్స్ నుంచి ఐసీయూకు మార్చడానికి 25 నిమిషాలు పట్టినప్పటికి ఆక్సిజన్ ఫ్లో మీటరును మార్చలేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పని చేయని ఆక్సిజన్ ఫ్లో మీటర్ల స్థానంలో కొత్త మీటర్లు అమర్చడంలో ఎందుకు విఫలమయ్యారో తెలుపుతూ 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సూపరింటెండెంట్ విజయ్ భాస్కర్, హెడ్ నర్సులు మహాలక్ష్మి, రాజేశ్వరి లకు షోకాజ్ నోటీసులిచ్చారు.
ఆసుపత్రిలో ఆక్సిజన్ ఫ్లో మీటర్ల స్టాక్ లేకపోవడానికి గల కారణాలు, స్టాక్ లేకపోయినా పై అధికారులకు సమాచారం ఇవ్వకపోవడానికి గల కారణాలు తెలపాలని షోకాజ్ నోటీసులో పేర్కొన్నారు.
ముందే పీడీ ఆరోగ్య పరిస్థితి ఆసుపత్రి వర్గాలకు తెలిసినా సమయానికి స్ట్రెచర్ అందుబాటులో ఉంచడంలో ఎందుకు విఫలమయ్యారో తెలపాలన్నారు.
సుబ్బరాయుడు లాంటి నిబద్ధత కలిగిన అధికారి లేని లోటు పూడ్చలేనిదని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు అన్నారు.
తానే స్వయంగా ఆసుపత్రి నోడల్ అధికారిని అదేశించి ఆస్పత్రిలో ఐసీయూ పడక సిద్ధం చేయించినప్పటికి ఒకరిద్దరు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఒక ఉన్నతాధికారిని కోల్పోవడం బాధాకరమన్నారు.