అంబేద్కర్ త్యాగం అజరామరం – డా.ఆకుల సంజీవయ్య
మనుషుల మధ్య విభజనలు చెల్లవని చెల్లు చిట్టి రాసిన మహానీయుడు భీంరావు రాంజీ అంబ్కేద్కర్ అని పరకాల సివిల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఆకుల సంజీవయ్య అన్నారు.
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 130వ జయంతి వేడుకలు స్థానిక సివిల్ ఆసుపత్రిలో బుదవారం ఘనంగా జరిగాయి.
ఈ సందర్బంగా డాక్టర్ ఆకుల సంజీవయ్య మాట్లాడుతూ రెండు గ్లాసుల పద్దతి, చంకలో చెప్పులు, గుడిలో బడిలో నో ఎంట్రీ బోర్డులు, మహిళలపై ఆంక్షలు ఎంత మత్రాం చెల్లవని తేల్చి చెప్పిన గొప్ప మహానీయుడు అన్నారు.
మహారాష్ట్రలోని సతార్ జిల్లా అంబవాడ గ్రామంలో రాంజీ-భీమాబాయి దంపతులకు పద్నాలుగవ సంతానంగా జన్మించిన అంబేద్కర్ చిన్నతనం నుండి కుల వివక్షకు గురై బడి నుండి గెంటివేయబడ్డారని డా.ఆకుల అన్నారు.
వీధి దీపాల కింద కూర్చోని చదువుకున్న బాబాసాహెబ్ అక్షరాలతో బడుగు బలహీన వర్గాలకు ఆత్మగౌరవాన్ని తీసుకురావడానికి తన జీవితమంతా పోరాటం చేశారని డా.ఆకుల కొనియాడారు.
పుట్టుక అనేది మనిషి అవకాశాలను, అస్తిత్వాన్ని అడ్డుకోకూడదని స్వేచ్ఛ, సమానత్వం ప్రతి భారతీయుని ప్రాథమిక హక్కు కావాలని పాటుపడ్డారని ఆయన అన్నారు.
డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ వ్యక్తిత్వానికి సమకాలిన దేశ రాజకీయాల్లో చాలా ప్రాధాన్యతనిచ్చిందని డా.ఆకుల అన్నారు.
కులం పునాదుల మీద ఒక జాతిని గాని, ఒక నీతిని గాని నిర్మించలేరని చాటి చెప్పారని ఆయన అన్నారు.
దేశం అభివృద్ధి చెందడం అంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదని, పౌరుని నైతికాభివృద్దే నిజమైన దేశాభివృద్ధి అని అంబేద్కర్ చెప్పారన్నారు.
డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ కేవలం దళితులకే కాకుండా సమాజంలోని ప్రతి ఒక్కరికి హక్కులు ప్రసాదించారని, ఆయనను స్మరించుకోవడంతో పాటు తన ఆశయ సాధనలో భారత దేశ సమాజమంతా పయనించగలిగినప్పుడే ఆయన కన్న కలలు నెరవేరుతాయని డా.ఆకుల అభిప్రాయపడ్డారు.
ఇంకా ఈ కార్యక్రమంలో డా.చందూలాల్, డా.రాజేందర్ రెడ్డి తదితర వైద్యులు, స్టాఫ్ నర్సులు తదితరులు పాల్గొన్నారు.