రేపే ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఓటింగ్ కు సర్వం సిద్ధం
తెలంగాణ రాష్ట్రంలో రేపు జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది.
ఉమ్మడి నల్గొండ-ఖమ్మం-వరంగల్ స్థానంతోపాటు.. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానానికి ఎన్నికలు జరుగనున్నాయి.
రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో 164 మంది అభ్యర్థులు పోటీలో ఉండటంతో ఈసారి 1,685 జంబో బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లపై అదనపు డీజీ, కలెక్టర్లు, ఎస్పీలు, రిటర్నింగ్ అధికారులతో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ సమీక్షిస్తున్నారు.
మహబూబ్‌నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం 93 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
5లక్షల 36వేల 268 ఓటర్ల కోసం 799 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ప్రతీ పోలింగ్ కేంద్రానికి రెండు బాక్సుల చొప్పున 1500 బ్యాలెట్ బాక్స్‌లను సిద్ధం చేశారు.
ఎన్నికల కోసం మొత్తం 3వేల 835 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటారు. వారిలో 959 మంది పీఓలు ఉండగా, 2వేల 876మంది ఓపీఓలు ఉన్నారు.
వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్ట భద్రుల నియోజకవర్గంలో 2015లో జరిగిన ఎన్నికల్లో 22 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, ఈ సారి 71 మంది పోటీ పడుతున్నారు.
గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 2,81,138 ఓట్లు ఉండగా 1,53,547ఓట్లు పోలయ్యాయి.
ఈసారి 5,05,565 మంది ఓటర్లు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. వీరి కోసం 731 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
నల్లగొండ మార్కెటింగ్‌శాఖ గిడ్డంగిలో ఓట్ల లెక్కింపు కోసం 8 హాళ్లలో 56 టేబుళ్లు ఏర్పాటు చేశారు.
పోలింగ్ సమయంలో కొవిడ్ నిబంధనలు పూర్తిస్థాయిలో అమలు చేయనున్నారు.
ఓటు వేసేందుకు వచ్చేవారు తప్పనిసరిగా మాస్కులు పెట్టుకోవాలి. భౌతిక దూరం నిబంధనలు పాటించాలి.
ఓటరు స్లిప్‌తోపాటు, ఏదైనా గుర్తింపు కార్డు వెంట తీసుకెళ్లాలి.
పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ సరళిని వీడియోగ్రఫీ తీయనున్నారు