మానవత్వం మంట కలిసి నిండు ప్రాణం గాలిలో కలిసింది
శ్రీకాకుళం: డబ్బులు ఉన్నప్పటికీ అవి వాడుకునే పరిస్థితి లేకపోవడంతో ఓ కరోనా బాధితురాలు రోడ్డుపైనే ప్రాణాలు విడిచిన హృదయ విదారక ఘటన జిల్లాలోని రాజాంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్ లో చోటు చేసుకుంది.
వివరాలలోకి వెళితే, కరోనా సోకిన అంజలి అనే మహిళను జిల్లాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి బంధువులు తీసుకువచ్చారు.
అయితే క్యాష్ పేమెంట్ చేయకుండా అడ్మిట్ చేసుకోలేమని సదరు ఆసుపత్రి సిబ్బంది స్పష్టం చేశారు. ఫోన్ పే, గూగుల్ పే లాంటి ఆన్లైన్ పేమెంట్‌ను కూడా ఆస్పత్రి సిబ్బంది నిరాకరించింది.
కేవలం క్యాష్ ఉంటేనే అడ్మిట్ చేసుకుంటామంటూ స్పష్టం చేసింది. దీంతో చేసేదేమీ లేక డబ్బు కోసం బాధితురాలి బంధువులు ఏటీఎంల చుట్టూ 3 గంటలు తిరిగారు.
ఇంతలోనే బాధితురాలు అంజలికి ఊపిరి ఆడక పరిస్థితి విషమించడంతో రోడ్డుపైనే మరణించింది.
మృతురాలిది రాజాం మండలం పెంటఅగ్రహారం. ఆస్పత్రి సిబ్బంది వైఖరి పట్ల మృతురాలి బంధువులు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
డిజిటల్ ఇండియా అంటూ ఆన్లైన్ పేమెంట్స్ ఎక్కువగా జరుగుతున్న ఈ కాలంలో ఇంకా క్యాష్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే అంటూ ప్రజల ప్రాణాలు తీయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.