ఆంధ్రా యూనివర్సిటిలో కరోనా కలకలం
రాష్ట్రంలో కరోనా వైరస్ రెండవ దశ వ్యాప్తి నియంత్రణకు విస్తృత చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ సంచాలకులు డా. టి.గీతాప్రసాదిని పేర్కొన్నారు.
కోవిడ్ టీకా పంపిణీ విస్తృతంగా జరుగుతోందని ఈ నెల 30వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సచివాలయాల్లో టీకా పంపిణీ చేపడతామని తెలిపారు.
కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న విశాఖపట్నం, చిత్తూరు, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో ప్రత్యేక అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు.
అయితే, విశాఖపట్టణం ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ వసతి గృహంలో రెండు రోజుల వ్యవధిలో 90 మంది విద్యార్ధులకు కరోనా వైరస్ సోకడంతో అధికారం యంత్రాంగం అప్రమత్తం అయింది.
బయట నుంచి వచ్చిన విద్యార్ధి ద్వారా ఇక్కడి విద్యార్ధులకు వైరస్ సోకిందని అందువల్ల వసతి గృహాల్లోని 1300 మంది విద్యార్ధులకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించామని విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.కృష్ణమోహన్ తెలిపారు.
ప్రస్తుతం కరోనా పాజిటివ్ వచ్చిన 90 మంది విద్యార్ధుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, వారికి ఐదగురు వైద్యుల బృందం నిరంతరం సేవలందిస్తోందని వెల్లడించారు.
బాధితులను వసతి గృహాల్లోనే ఉంచి కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నామని, తల్లిదండ్రులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, ఇతర విద్యార్ధులనూ ఐసోలేషన్లో ఉంచి పర్యవేక్షిస్తున్నామని ఆయన తెలిపారు.
ఐసొలేషన్ వార్డుల్లో ఉన్న వారిని 10 రోజుల వరకు ఉంచి, ఆ తర్వాత పరీక్షలు జరుపుతామని రిజిస్ట్రార్ తెలిపారు.