తొమ్మిది మంది వాలంటీర్లు తొలగింపు
శ్రీకాకుళం, మే 16 : జిల్లాలో చేపట్టిన ఆరో విడత ఫీవర్ సర్వే లో నిర్లక్ష్యం వహించిన తొమ్మిది మంది వాలంటీర్లను తొలగిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ డాక్టర్ కే. శ్రీనివాసులు తెలిపారు.
ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన జారీ చేస్తూ ఫీవర్ సర్వేలో అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించి అన్ని తప్పులు తడకల రిపోర్టులను సమర్పించారని ఆయన తెలిపారు.
తొలగించిన తొమ్మిదిమంది వాలంటీర్ల వివరాలు:
టెక్కలి మండలం టెక్కలి ఐదవ సచివాలయ పరిధికి చెందిన దండాసి డిల్లేశ్వర రావు, దాసరి భారతి, దేవాది రామకృష్ణ, తోట వెంకటేష్, బొడ్డు తులసి, గండి రాజారెడ్డి., రణస్థలం మండలం నారువ సచివాలయ పరిధికి చెందిన పడగల రమణ, భామిని మండలం బాలేరు 2 గ్రామ సచివాలయ పరిధికి చెందిన ఏ. రాజారావు, లావేరు మండలం గుమడ గ్రామ సచివాలయానికి చెందిన గంగవరపు అప్పారావు.
ఈ తొమ్మిది మందిని తొలగిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ తెలియజేస్తూ ఫీవర్ సర్వేను జిల్లా యంత్రాంగం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతుందని అన్నారు.
ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో, అంకితభావంతో నిర్వహించాలని ఆయన స్పష్టం చేశారు. వాలంటీర్, ఆరోగ్య సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి ఫీవర్ సర్వే నిర్వహించాలని ఆయన పేర్కొన్నారు.
అనేక మంది ఇంటింటికి సర్వేకు వెళ్లకుండా నివేదికలు సమర్పిస్తున్నట్లు తెలియవచ్చిందని అందులో భాగంగా తొమ్మిదిమందిని తొలగించడం జరిగిందని అన్నారు.
ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో అటువంటి వారిని తొలగించడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు.
మండల సర్వేలియన్స్ అధికారులు పరిస్థితులను గమనించాలని ఆయన పేర్కొంటూ అవసరమైతే మండల సర్వేలియన్స్ అధికారులపై చర్యలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు.