మాస్కులు ధరించండి..
భౌతిక దూరం పాటించండి..
కరోనాను నివారించండి..
ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ ప్రభు..
మండపేట: కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి చాలా తీవ్రంగా ఉందని, కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కోవిడ్ బారిన పడకుండా ఉండటానికి అవకాశం ఉందని అర్బన్ హెల్త్ కేర్ సెంటర్ వైద్యాధికారి డాక్టర్ ప్రభు పేర్కొన్నారు.
డాక్టర్ ప్రభు స్థానిక మీడియాతో మాట్లాడుతూ కరోనా కు ఎవరూ భయపడవలసిన పనిలేదని ముందుగానే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే వ్యాధి నయం కావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందని అన్నారు.
భయాందోళన చెందడం వలన వ్యాధి తీవ్రమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని అన్నారు. కరోనా లక్షణాలు కనిపించిన వెంటనే ప్రభుత్వ వైద్యులను సంప్రదించాలని సొంత వైద్యం పనికిరాదని అన్నారు.
తాము 24 గంటలు వైద్యం చేయడానికి సిద్ధంగా ఉన్నామని, ఎవరికి ఎలాంటి సందేహాలు ఉన్నా ప్రభుత్వ వైద్యులను సంప్రదించాలని కోరారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
మే 1వ తేదీ నుండి 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరికి కరోనా వ్యాక్సిన్ వేస్తామని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కోవిడ్ వ్యాక్సిన్ వేసిన తర్వాత కొద్దిపాటి జ్వరం, ఒళ్ళు నొప్పులు వస్తాయని దానికి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, ఎటువంటి టెస్ట్ చేయించుకోనవసరం లేదని పారాసిటిమాల్ టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుందని అన్నారు.
ప్రజలందరూ ప్రభుత్వానికి సహకరించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.