అవసరమైతే సైన్యాన్ని రంగంలోకి దించండి
భారత్ ప్రభుత్వానికి అమెరికా నిపుణుడు ఫౌచీ సూచన
భారత్‌లో కోవిడ్ పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉందని వ్యాఖ్య
భారత్‌లో కోవిడ్ తీవ్రత చాలా ఆందోళనకర స్థాయిలో ఉందని అమెరికా ఉన్నతస్థాయి ఆరోగ్య నిపుణుడు డాక్టర్ ఆంథోనీ ఫౌచీ వ్యాఖ్యానించారు.
కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు సర్వశక్తులూ వినియోగించు కోవాలనీ తక్షణమే తాత్కాలిక కోవిడ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని భారత ప్రభుత్వానికి ఆయన సూచించారు.
అవసరమైతే సైన్యాన్ని కూడా రంగంలోకి దించాలన్నారు. కేవలం వైద్య సామగ్రి అందించడమే కాదు, వైద్య సిబ్బందిని కూడా భారత్‌కు పంపించాలని ఇతర దేశాలకు ఆయన విజ్ఞప్తి చేశారు.
భారత్‌లో కోవిడ్ కేసులు మూడు నెలల్లోనే రెట్టింపై 2 కోట్లు దాటి పోవడంతోపాటు మహమ్మారి బారిన పడి 2.20 లక్షల మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ఆయన పైవ్యాఖ్యలు చేశారు.
అమెరికాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలెర్జీ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ డైరెక్టర్ అధ్యక్షుడు జో బైడెన్‌కు చీఫ్ మెడికల్ అడ్వైజర్ అయిన డాక్టర్ ఫౌచీ(80) పీటీఐకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు విషయాలు తెలిపారు.
పరిస్థితి తీవ్రత దృష్ట్యా ఇన్ఫెక్షన్ వ్యాప్తిని నిలువరించేందుకు భారత్‌లో కొన్ని వారాలపాటైనా లాక్డౌన్ విధించడం మేలన్నారు.